తారకరత్న, యాంకర్ లాస్య, సింగర్ నోయల్, ఆర్‌జె హేమంత్ అందరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. రేవంత్ మాత్రం హీరోగా నిలదొక్కుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా కెరీర్ పరంగా చూస్తే తారకరత్న సీనియర్ తను మినహా అందరూ సినిమాల్లో ఎలాగెలాగో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళే. ఇలాంటి వారితో దర్శకుడు కృష్ణకిషోర్, గుంటూరు టాకీస్ ఫేమ్ రాజ్‌కుమార్.ఎం చేసిన ప్రయత్నమే `రాజా మీరు కేక`. అసలు అందరూ కేక పెట్టేలా ఈ యూనిట్ ఎలాంటి సినిమా చేసింది. అసలు సినిమా చూస్తే ఆనందంతో కేక వేస్తారా..భయంతో గావు కేక వేస్తారో తెలియాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
శ్వేత(లాస్య), రవి(రేవంత్) మధ్య తరగతి కుటుంబీకులు. నాగరాజు(తారకరత్న)కి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు. శశాంక్(నోయల్)కు స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇష్టం. దానిపై మంచి గ్రిప్ కూడా ఉంటుంది. శ్రీను(హేమంత్) బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి. అందరూ చిన్ననాటి స్నేహితులు. శశాంక్, శ్రీను డబ్బుతో స్టాక్ మార్కెట్లో షేర్స్ కొంటాడు. నాగరాజు తన ఎదుగుల కోసం రాష్ట్ర సీఎం (పోసాని కృష్ణమురళి)తో చేతులు కలిపి సాఫ్ట్ వేర్ ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ వైపు తరలించాలని ప్రయత్నిస్తాడు. కానీ అతనికి బోర్డ్ మెంబర్లు సహకరించరు. దాంతో 50వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీ షేర్ల వేల్యూస్ పడిపోతాయి. కంపెనీ మూత పడిపోతుంది. ఆ తర్వాత నాగరాజు ఏం చేశాడు? అతని చర్యలకు లాస్య, రేవంత్, నోయల్, హేమంత్ జీవితాలు ఎలా బలయ్యాయి? చివరకు స్నేహితులు ఏం చేశారు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ:
దర్శకుడు కృష్ణ కిషోర్ సత్యం కంప్యూటర్స్ స్కామ్‌ను ఆధారంగా చేసుకుని కథను రాసుకున్నాడు. సత్యం కంప్యూటర్స్ స్కామ్ వల్ల చాలా మంది ఉద్యోగులు, సదరు కంపెనీ షేర్స్ కొన్నవారు చాలా మంది రోడ్డున పడ్డారు. అలాంటి వారిలో ఓ నలుగురుని తీసుకుని దాని చుట్టూ కథను అల్లుకున్నాడు. అయితే మెయిన్ పాయింట్‌ను చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, కథనం బోర్‌గా అనిపిస్తాయి. పాత్రల మధ్య వెకిలి నవ్వులు, చర్యలు ప్రేక్షకుడికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే సన్నివేశాల మధ్య లింక్ ఉండదు. సినిమాను ఏదో చుట్టేదాం అనే ఆలోచనతోనే చేసినట్లు కనపడింది. దీని వల్ల దర్శకుడి తడబాబు కనపడుతుంది. హీరోకు అతని లవర్ ఓకే చెప్పిన తర్వాత కూడా అతను ఆమెను ఇంప్రెస్ చేయడానికి చేసే ప్రయత్నాలు చూస్తే అబ్బో అని పిస్తాయి. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ సరిగ్గా పండలేదు. లాజిక్స్ అస్సలు మరచిపోయినట్లున్నారు. నటీనటుల విషయానికి వస్తే పృథ్వి, నల్ల వేణు కామెడీ బావుంది. ఫోటోగ్రఫీ బావుంది. రేవంత్, నోయల్, లాస్య చక్కగా నటించారు. ప్రతి పాత్రా ప్రాధాన్యం ఉన్న పాత్రే. తాగుబోతు రమేశ్ పాత్ర కాసేపే ఉన్నా నవ్వుతెప్పించింది. తారకరత్న తన పాత్రలో ఒదిగిపోయారు.
బోటమ్ లైన్: రాజా మీరు కేక.. చూస్తే గావు కేక
Comments