పోర్నోగ్రఫీ కేసు: రాజ్‌కుంద్రాకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్ట్
- IndiaGlitz, [Tuesday,September 21 2021]
అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో అరెస్టయిన వ్యాపార వేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరైంది. రూ.50 వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు ఆయనకు సోమవారం బెయిల్‌ను మంజూరు చేసింది. పోర్నోగ్రఫీ కేసులో జులై 19న రాజ్‌కుంద్రా సహా పలువురిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇటీవల 1400 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్షుల జాబితాలో శిల్పాశెట్టి పేరునూ పోలీసులు చేర్చారు. ఈ క్రమంలో ఆమెను విచారించగా.. తన భర్త వ్యాపారాలు, ఇతర కార్యకలాపాల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు.
సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులకు మాయమాటలు చెప్పి నీలిచిత్రాలు తీయడం ద్వారా రాజ్‌కుంద్రా (46) పెద్దఎత్తున ఆర్జించినట్లు ముంబయి పోలీసులు ఛార్జిషీటులో పేర్కొన్నారు. రాజ్‌కుంద్రా, అతని సహచరుడైన రేయాన్ థోర్పేలకు వ్యతిరేకంగా ఈ ఛార్జిషీటును క్రైం బ్రాంచ్ పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించారు. వీరిద్దరూ నీలిచిత్రాలను కొన్ని యాప్‌ల ద్వారా మార్కెటింగ్ చేసుకునేవారని అందులో వెల్లడించారు. ఈ కేసులో సింగపూర్‌కు చెందిన యశ్ ఠాకుర్, లండన్‌కు చెందిన ప్రదీప్ బక్షి కూడా నిందితులుగా ఉన్నారు. వీరిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే శిల్పాశెట్టి తన భర్త రాజ్‌కుంద్రాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటూ బీ టౌన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే తాజాగా శిల్పా ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్ట్ మరోసారి ఈ వార్తలకు బలం చేకూర్చాయి. స్టోరీస్‌లో ‘న్యూ ఎండింగ్స్’ అనే కొటేషన్‌ను ఆమె ప్రత్యేకంగా పోస్ట్ చేసింది. ఇందులో ‘జీవితాన్ని వెనక్కి తిప్పి కొత్తగా ప్రయాణం మొదలు పెట్టే ఛాన్స్ ఉండదు, అయితే ఆ ప్రయాణాన్ని కొత్తగా ముగించవచ్చు’ అని అర్ధం వచ్చేలా సందేశం ఉంది. దీంతో శిల్పాశెట్టి తన వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పెట్టనుందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.