ఒక్క దుబ్బాక ఉపఎన్నిక.. తలెత్తుతున్న ప్రశ్నలెన్నో..
Send us your feedback to audioarticles@vaarta.com
దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఏం చెప్పింది? ప్రజలు మార్పు కోరుకోవాలనుకుంటున్నారా? కేసీఆర్ పాలనపై వ్యతిరేకత నివురు గప్పిన నిప్పులా ఉందా? సెంటిమెంటు మత్తు నుంచి ప్రజలు బయటకు వచ్చేశారా? ఇక ఈ ఫలితం మున్ముందు ఎన్ని పరిణామాలకు దారితీయనుంది? రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై దీని ప్రభావం ఏమైనా పడబోతోందా? మొత్తం ఎపిసోడ్‌లో మంత్రి హరీష్ రావు బలిపశువు కాబోతున్నారా? ఈ ఫలితం నుంచి తెలంగాణ ప్రజానీకం ఎలా ప్రభావితమవుతుంది? కేసీఆర్ నిర్ణయమే టీఆర్ఎస్‌ను ముంచేసిందా? విజయ కాంక్షను శ్వాసగా మలుచుకున్న బీజేపీ గెలుపునకు మున్ముందు టీఆర్ఎస్ కళ్లెం వేయగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఒక్క దుబ్బాక ఎన్నికల ఫలితం నుంచి ఉత్పన్నమవుతున్నాయి.
టీఆర్ఎస్ ఓటమికి కారణాలివేనా?
నిజానికి దుబ్బాకలో సోలిపేట సుజాతను ఎన్నికల్లో నిలబెట్టడం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నచ్చలేదనే టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని హరీష్‌రావు కూడా అదిష్టానం దృష్టికి తీసుకెళ్లారని చర్చ నడుస్తోంది. సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో వర్కవుట్ కాదని.. కాబట్టి ఆమెను నిలబెట్టడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని కేసీఆర్‌కు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదని సమాచారం. అన్ని చోట్ల వర్క్ అయినట్టు దుబ్బాకలో కూడా తన స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందన్న ఓవర్ కాన్ఫిడెన్సే ముంచేసిందనేది నిపుణులు చెబుతున్న మాట. తప్పనిసరి పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్‌గా, ఉపఎన్నికల కింగ్‌గా పేరు గాంచిన హరీష్ రావు రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. అభ్యర్థిని తానేనని భావించి ఓటు వేయాలని హరీష్ రావు కోరినా ప్రజలు మాత్రం బీజేపీకే ఓటేశారు. పగలెనుక..రాత్రెనుక టీఆర్ఎస్ విజయం కోసం హరీష్ రావు శ్రమించిన మాట మాత్రం కాదనలేని సత్యం. కానీ ఈ ఎన్నిక ఓటమికి హరీష్‌రావునే బలి పశువును చేస్తారనే టాక్ కూడా బాగా వినిపిస్తోంది.
బీజేపీ నెక్ట్స్ టార్గెట్ జీహెచ్ఎంసీ..
మరోవైపు దుబ్బాక గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇక తమ తదుపరి టార్గెట్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలేనని కమలనాథులు బహిరంగంగానే చెబుతున్నారు. దుబ్బాక విజయం స్ఫూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పని చేయనుంది. అలాగే ఈ అపజయాన్ని టీఆర్ఎస్ కూడా అంత తేలికగా ఏమీ తీసుకోదు. కాబట్టి ఇప్పుడే బీజేపీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మరోవైపు బీజేపీ స్టామినా ఏంటో టీఆర్ఎస్‌కు కూడా తెలిసొచ్చింది. దీంతో ఇంతకు మించిన హోరాహోరీ పోరును తెలంగాణ ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడబోతున్నారనేది మాత్రం ఖాయం. జీహెచ్ఎంసీలో కూడా బీజేపీ పాగా వేయగలిగితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు అది మరింత దోహదపడుతుందని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోకి వచ్చే అనేక నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. శేరిలింగంపల్లిలో అయితే బీజేపీ నేత గజ్జల యోగానంద్ ఏకంగా పాదయాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారాలపై హామీలిస్తూ స్థానికంగా సందడి చేస్తున్నారు. అటు పాతబస్తీలోనూ పాగా వేయడానికి బీజేపీ నేతలు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు.
నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి..
నిజానికి టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉందనేది మాత్రం దుబ్బాక ఉపఎన్నికతో స్పష్టమవుతోంది. ఉద్యోగాల ఊసే లేదని నిరుద్యోగులు.. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. డీఏ లేదు.. ఏమీ లేవని ఉద్యోగులు.. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా నియంత్రణ లేదు.. కరోనా వైద్యం విషయంలో ప్రభుత్వం అవలంభించిన అలసత్వం.. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై నియంత్రణ లేకపోవడం.. ఇటీవల వచ్చిన వరదలు.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వాసులకు మిగిల్చిన నష్టం.. ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా అంతంత మాత్రమే.. పలు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జనాలు విపరీతంగా తిరగబడ్డారు. మొత్తంగా చూస్తే ప్రజల్లో మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంటు ఆవిరై.. తమకు మేలు చేసే నాయకత్వాన్ని ఎంచుకోవాలనే ఆలోచనకు ప్రజానీకం వచ్చిందని దుబ్బాక ఎన్నికలను బట్టి అర్థమవుతోంది. తెలంగాణ ప్రజానీకమంతా ఈ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా పెద్ద దెబ్బే తగిలే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com