హైదరాబాద్‌లో గాలి వాన బీభత్సం.. పలు ప్రాంతాల్లో పవర్ కట్, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కి ఫిర్యాదుల వెల్లువ

  • IndiaGlitz, [Wednesday,April 26 2023]

హైదరాబాద్‌ను మంగళవారం భారీ వర్షం వణికిస్తోంది. సాయంత్రం ఒక్కసారిగా నగరంలో వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు పడటంతోపాటు ఈదురుగాలుల ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపోయామి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ, బాలానగర్, అమీర్‌పేట్ , హిమాయత్ నగర్, జీడిమెట్ల, సూరారం, నాగారం, నాచారం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. భారీ వర్షం ధాటికి రోడ్ల పైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జలమండలి, జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ , విద్యుత్ శాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.

గాలి వాన ధాటికి గంటల తరబడి పవర్ కట్:

మరోవైపు నగరంలోని చాలా ప్రాంతాల్లో దాదాపు మూడు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ శాఖ సహాయక కేంద్రాలకు వందలాది మంది ఫోన్లు చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను తెలియజేస్తున్నారు. మరోవైపు ఇబ్రహీంబాగ్ సబ్‌స్టేషన్ నుంచి పెద్ద మంగళారం ఫీడర్ ప్రాంతానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని.. దీనిని వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. వేసవి కాలం కావడం, పైగా గంటల తరబడి విద్యుత్ కట్ చేయడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.