అసలే చలితో గజగజ... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, అక్కడక్కడా వడగండ్ల వానలు
Send us your feedback to audioarticles@vaarta.com
అసలే చలితో వణుకుతుంటే.. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేదు వార్త చెప్పింది. నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో నేటి నుంచి రెండు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో గడిచిన మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. ఏపీలో రెండు రోజులుగా పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోగా.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.
ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి), పశ్చిమ గోదావరి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సైతం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ క్రమంలో రైతులు తమ ధాన్యం, పంట ఉత్పత్తులు వర్షానికి పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. గత మూడు రోజుల నుంచి ఇక్కడ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జనవరి 14 వరకు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల వడగండ్లతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments