దసరాకు భారీ షాకిచ్చిన రైల్వే శాఖ!

  • IndiaGlitz, [Saturday,September 28 2019]

ఇదేంటి దసరాకు బంపరాఫర్ ఇవ్వాల్సింది పోయి.. భారీ షాకివ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. దసరా పండుగను అదనుగా చూసుకుని సొమ్ము చేసుకోవాలని భావించిన దక్షిణ మధ్య రైల్వే.. ఫ్లాట్ ఫామ్ టికెట్లను భారీగా పెంచేసింది. అది కూడా ఒకట్రెండు రూపాయిలు కాదండోయ్.. రూ. 10 నుంచి.. ఏకంగా రూ. 30కు పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఒకింత కంగుతిన్నారు. కాగా.. నేటి నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకూ పెంచిన ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే.. అక్టోబర్ 10 తర్వాత మళ్లీ పాత రేట్లనే అమలు చేస్తామని అధికారులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

భారీ షాక్!
మొత్తానికి చూస్తే.. దసరా సందర్భంగా ప్రయాణికులకు, వారిని సాగనంపడానికి వచ్చేవారికి రైల్వే శాఖ భారీ షాక్ తగిలినట్లేనని చెప్పుకోవచ్చు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని కేవలం మూడు స్టేషన్లలోనే మాత్రమే ఇలా ఫ్లాట్ ఫామ్ టికెట్లు పెంచడం జరిగింది. విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. కాగా.. ఈ మూడు స్టేషన్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో, దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలు పెంచింది.

త్రిబుల్ పెంచేశారుగా!
కాగా.. గతంలో పండుగల వేళ ఉండే రద్దీ దృష్ట్యా రూ.10 ఉన్న ప్లాట్‌ఫాం టికెట్ ధరను 20 రూపాయలకు మాత్రమే పెంచేవారు.. అయితే ఈ సారి అస్తమాను 20 రూపాయిలే ఉంటే బాగుంటుందిలే అని ఏకంగా త్రిబుల్ చేసి పెంచేశారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులు సర్వత్రా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. రైల్వే శాఖ ఈ రేంజ్‌లో షాకిస్తుందని బహుశా ఏ ప్రయాణికుడూ ఊహించి ఉండరేమో మరి.