Coach Restaurant : రైలు బోగీలో రెస్టారెంట్.. లోపల అడుగుపెడితే థ్రిల్లింగే, రైల్వే శాఖ వినూత్న ఆలోచన
- IndiaGlitz, [Wednesday,October 12 2022]
భారతీయ రైల్వే తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. గతంలో మాదిరిగా కేవలం టికెట్ల విక్రయం, రైల్వే స్టేషన్‌లలో వాణిజ్య ప్రకటనలకే పరిమితం కాకుండా కాలానికి తగ్గట్లుగా మారుతోంది. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే వినూత్న ఆలోచన చేసింది. నాలుగు గోడల మధ్య కాకుండా విభిన్నంగా రైలు బోగీలో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. గుంటూరులో ఈ కొత్త రెస్టారెంట్ కొలువుదీరింది. రైల్వేస్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన ఈ రైల్ కోచ్ రెస్టారెంట్‌ను డీఆర్ఎం ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఇది తొలిసారి.
పాత రైలు బోగీకి ఆధునిక హంగులు:
ఓ పాత బోగీని రెస్టారెంట్‌గా మార్చి.. గుంటూరు రైల్వే స్టేషన్ ఎదురుగా వున్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణంలో కూర్చొని తిన్నట్లుగా అనుభూతి చెందేలా కోచ్‌లో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 24 గంటల పాటు ఆహారం అందుబాటులో వుంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. రైల్వే ప్రయాణీకులు, స్థానికులు ఎవరైనా ఈ రెస్టారెంట్ రుచుల్ని ఆస్వాదించవచ్చని అధికారులు తెలిపారు.
24x7 నాణ్యమైన ఆహారం :
గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ మోహన్ రాజా మాట్లాడుతూ... ప్రయాణీకులకు ప్రీమియం అనుభవాన్ని అందించడానికి ఈ వినూత్న ఆలోచన చేసినట్లు తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లైసెన్స్ మంజూరు చేయడం ద్వారా కోచ్ రెస్టారెంట్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ రెస్టారెంట్‌లో స్థానిక ధరలకే 24 గంటలూ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని డీఆర్ఎం వెల్లడించారు.