సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్
- IndiaGlitz, [Wednesday,May 08 2019]
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ‘చౌకీదార్ చోర్’ అంటూ ప్రధానమంత్రిని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు తప్పుగా ఆపాదించినందుకు గానూ ఆయన సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.
అయితే ఈ వ్యాఖ్యలను తాను ఉద్దేశపూర్వకంగా చేయలేదని పేర్కొంటూ బుధవారం నాడు మూడు పేజీల అఫిడవిట్‌ను రాహుల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు అత్యున్నత సంస్థ అని, దాని మీద తనకు అపార గౌరవం ఉందని అఫిడవిట్లో రాహుల్ పేర్కొన్నారు. రఫెల్ వ్యవహారంలో మోదీ చోర్ అని సుప్రీంకోర్టే స్పష్టం చేసిందని రాహుల్ వ్యాఖ్యానించారు.
న్యాయవ్యవస్థ విధానాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ జోక్యం చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. ఈ వ్యవహారంలో తనపై నమోదైన నేరపూరిత కోర్టు ధిక్కార కేసు విచారణను మూసేయాలని రాహుల్ ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించారు. చౌకీదార్ చోర్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీర్పునకు ఆపాదించినందుకు గానూ రాహుల్ గతంలో విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.