Modi:తెలంగాణలో రాహుల్, రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు: మోదీ
- IndiaGlitz, [Tuesday,April 30 2024]
తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. జహీరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ ఆర్(రేవంత్, రాహుల్) ట్యాక్ వసూలు చేసి ఢిల్లీలో కప్పం కడుతున్నారని.. వెంటనే ఆర్ ట్యాక్స్ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా పంచసూత్రాలతో పాలన చేస్తుందని విమర్శించారు. పంచసూత్రాలు అంటే అవినీతి, అబద్ధాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా, కుటుంబ రాజకీయాలు అని తెలిపారు.
పొరపాటున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలపై సంపద పన్ను కూడా వేస్తారని.. అలా మన సంపదలో 55 శాతాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇక మొన్నటి వరకూ తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి కుంభకోణం అని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దానిపై విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ పాలనలో ఓటుకు నోటు కేసును తొక్కి పెట్టారని.. రెండు పార్టీలు ఒకటే అని మోదీ విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోసం చేసిందన్నారు. ఈ పదేళ్లలో దేశం ఎంత ముందుకు వెళ్లిందో దేశ ప్రజలు అంతా చూశారని.. అలాగే అంతకుముందు కాంగ్రెస్ పాలనలో ఎంత అవినీతి ఉందో కూడా అందరూ చూశారని చెప్పుకొచ్చారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అవినీతి ఊబిలోకి నెట్టేసిందని అన్నారు. 500 ఏళ్లుగా భారతీయుల కలగా ఉన్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టామని వివరించారు. ఇక్కడ హైదరాబాద్‌లో పండుగలు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలు ఉన్నాయని.. ఓ వర్గం ఓట్ల కోసమే పండుగలపై ఆంక్షలు విధిస్తున్నారని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.