అందుకే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను చంపాలనుకున్నా : నిందితుడు రాఘవేంద్రరాజు

  • IndiaGlitz, [Thursday,March 03 2022]

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ కుట్రకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు రాఘవేంద్రరాజు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ .. తన వ్యాపారాలు దెబ్బతీసి, ఆర్థికంగా తనకు నష్టం చేకూర్చాడని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని రాఘవేంద్రరాజు చెప్పాడు.

అక్రమంగా కేసులు నమోదు చేయించడంతో పాటు తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీశాడని.. బార్‌ను మూసివేయించాడని ఆరోపించాడు. దీంతో పాటు అక్రమంగా ఎక్సైజ్‌ కేసులు నమోదు చేయించినట్టు పోలీసులకు తెలిపాడు. తన ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాన్ని కూడా శ్రీనివాస్ గౌడ్ రద్దు చేయించాడని.. ఈ కారణంగానే మంత్రి హత్యకు కుట్ర పన్నినట్టు రాఘవేంద్రరాజు చెప్పాడు.

కాగా.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే.. మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా నిందితులను వారం రోజుల కస్టడీకి కోరుతూ పేట్‌ బషీర్‌బాద్‌ పోలీసులు మేడ్చల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.