ప్రభాస్ రాధేశ్యామ్‌కు ఏపీలో టికెట్ల ధరల పెంపు, అయినా మెలిక పెట్టిన జీవో..!!
Send us your feedback to audioarticles@vaarta.com
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హేగ్డే జంటగా నటించిన ‘‘రాధేశ్యామ్’’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్ని అవాంతరాలను దాటుకుని రాదేశ్యామ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా రాధేశ్యామ్ కోసమే అన్నట్లుగా టికెట్ల ధరలను పెంచింది. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా తయారైంది రాధేశ్యామ్ పరిస్ధితి.
వివరాల్లోకి వెళితే.. ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్తగా జీవో నెం.13 జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే ఇక్కడే ఓ మెలిక పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో 20 శాతం షూటింగ్ జరుపుకున్న చిత్రాలకే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది జగన్ సర్కార్. రాధేశ్యామ్ చిత్రీకరణ ఏపీలో జరగకపోవడంతో, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కోల్పోయినట్లయ్యింది. అంతేకాదు.. అదనపు షోలు వేసుకునే అవకాశం కూడా ఉండదు. దాంతో కొత్త జీవో ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ల ధరలతోనే రాధేశ్యామ్ ప్రదర్శించాల్సి వుంటుంది.
కాకపోతే.. ఈ సినిమా ప్రీమియం టికెట్ ధరపై రూ.25 అదనంగా పెంచుకునేందుకు అవకాశం మాత్రం ఏపీ సర్కార్ కల్పించింది. ఈ సినిమా బడ్జెట్ రూ.170 కోట్లు కాగా.. ఇప్పటికే జీఎస్టీ, ఇతర బిల్లులను నిర్మాణ సంస్థ ఏపీ ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. నటులు తీసుకునే రెమ్యునరేషన్‌తో సంబంధం లేకుండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసిన పక్షంలో టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం జీవోలో తెలిపిన విషయం తెలిసిందే.
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాధేశ్యామ్‌కు ఊరటనిచ్చింది. రాష్ట్రంలో ఈ చిత్రం ఐదో షో వేసుకునేందుకు అనుమతి నిచ్చింది. మార్చి 11 నుంచి 25వ తేదీవరకు రాధేశ్యామ్ చిత్రాన్ని రోజుకు ఐదు షోలు వేసుకోవచ్చని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై రాధేశ్యామ్ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments