రాధే శ్యామ్: ప్రభాస్ - పూజా హెగ్డే మధ్య విభేదాలు.. అసలు విషయం బయటపెట్టిన చిత్రయూనిట్
- IndiaGlitz, [Thursday,September 23 2021]
అదేంటో.. కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ రిలేషన్స్, నటీనటుల మధ్య విభేదాల తాలూకు విషయాలు చర్చల్లో నిలుస్తుంటాయి. అయితే ఈ గాసిప్స్ కొందరికి స్టార్డమ్ తెచ్చిపెడితే మరికొందరిని మాత్రం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సమయంలో అనూహ్యాంగా చిక్కుల్లో పడేస్తుంది.
కొంతమంది హీరోహీరోయిన్స్ మధ్య సినిమా పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ మనస్పర్థలు కలుగుతుంటాయి. హీరోయిన్స్ చేసే చిన్న తప్పులవల్లే వారి కెరీర్‌పై దెబ్బ పడుతుంది. ఈ విషయం ఎంతోమంది విషయంలో రుజువైంది కూడా. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి అలాగే ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడుపై నెగిటివిటి పెరిగినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస ఆఫర్లను అందుకుంటూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుంది. ‘‘రాధే శ్యామ్’’ సినిమా షూటింగ్ సందర్భంగా బాహుబలి ప్రభాస్.. పూజా హెగ్డే మధ్య విభేధాలు చోటు చేసుకున్నాయని.. ఆమె తీరుతో ఎంతో కూల్‌గా ఉండే ప్రభాస్ సైతం విసిగిపోయారన్నది వాటి సారాంశం. అందువల్లే రాధేశ్యామ్‌లో ఇద్దరి మధ్యా సాగే రొమాంటిక్ సీన్స్ సైతం విడివిడిగా షూట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు గుప్పుమంటున్నాయి.
దీంతో ఈ ఇష్యూ జనాలతో పాటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. ఇది గమనించిన చిత్రయూనిట్ తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్, పూజాహెగ్డేలకు పడట్లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని తెలిపింది. ఈ సినిమాలో ప్రభాస్- పూజా హెగ్డేల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయని అన్నారు. పూజా మంచి టైం సెన్స్ పాటిస్తుందని, ఆమెతో పనిచేయడం కంఫర్ట్‌గా ఉందని మేకర్స్ వెల్లడించారు.
యూరప్ బ్యాక్ డ్రాప్లో పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.