నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధారవి..
- IndiaGlitz, [Sunday,March 24 2019]
సీనియర్ నటుడు రాధారవి హీరోయిన్ నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నయనతార ప్రధాన పాత్రల నటించిన 'కొలయుత్తిర్ కాలం' సినిమా ప్రెస్మీట్లో పాల్గొన్న రాధారవి ఈ వ్యాఖ్యలు చేయడం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 'నయనతార స్టార్ నటి. ఈమెను ఎంజిఆర్, శివాజీగణేషన్ వంటి గొప్ప నటులతో పోల్చి చూస్తారు. అలాంటి వాళ్లతో నయనతారను పోల్చడం బాధగా ఉంది. నయన్ మంచి నటే. అందుకే ఆమె ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆమెపై రాని వార్తలే లేవు. కానీ తమిళ ప్రజలు నాలుగురోజులే గుర్తు పెట్టుకుంటారు కాబట్టి అన్నీ మరచిపోయారు. నయనతార దెయ్యంలాగా నటిస్తారు.. మరో పక్క సీతలాగా కూడా నటిస్తారు. ఒకప్పుడు దేవత పాత్రలంటే కె.ఆర్.విజయ కోసం చూసేవాళ్లు. ఇప్పుడు ఎవరు పడితేవాళ్లు చేసేస్తున్నారు'' అన్నారు. నయనను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. నయన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పాటు శరత్‌కుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, చిన్మయి తదితరులు రాధారవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నయనతార అద్భుతమైన నటి. ఆమెతో పనిచేశాను. ఆమె ఎంత ప్రొఫెసనల్ నటో నాకు తెలుసు. రాధారవి ఏం మాట్లాడారో నేను పూర్తిగా వినలేదు. అయితే ఆయన్ని కలిసి ఇదేం బాగాలేదని చెప్పాను'' అని రాధికా శరత్‌కుమార్ అన్నారు. 'గొప్ప కుంటుంబంలో పుట్టినవాళ్లు ఇలా మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకోలేదు. అసలు ఆయనకు బుర్రలేదు. ఆయన మాటలకు ప్రేక్షకులు నవ్వి క్లాప్స్ కొట్టడం సరైన చర్య కాదు. ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. ఆయనపై నడిగర్ సంఘం కానీ.. మరేవరైనా కానీ.. యాక్షన్ తీసుకోలేరని తెలుసు' అని నయన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ తెలిపారు.
'తమిళనాడుకి చెందిన మగవారేవరైనా ఈ విషయంపై మాట్లాడుతారేమోనని చూస్తున్నా' అని చిన్మయి తెలిపారు.
వరలక్ష్మి శరత్‌కుమార్ స్పందిస్తూ.. మహిళలను తక్కువ చేసి మాట్లాడటం అలవాటైపోయింది. మౌనంగా ఉంటే కుదరదు. ఎన్ని సంఘాలు ఉన్నా.. నటీమణుల విషయానికి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోరు. మహిళలు ఒకరికొకరు తోడుగా నిలవాలి'' అన్నారు.