చిన్మయి క్షమాపణలు చెబితేనే చోటిస్తాం: రాధా రవి
- IndiaGlitz, [Sunday,February 16 2020]
డబ్బింగ్ కళాకారుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ నటుడు రాధారవి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇటీవల డబ్బింగ్ కళాకారుల సంఘానికి చెందిన ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవి కోసం రాధారవిపై గాయని చిన్మయి పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కొన్ని కారణాలతో తిరస్కరణకు గురైంది. దీంతో రాధారవి ఏకగ్రీవంగా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. మిగిలిన కార్యదర్శి, ట్రెజరర్, ఇతర కార్యవర్గ సభ్యుల పదవుల కోసం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 1300 సభ్యులు పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రాధా రవి మాట్లాడుతూ చిన్మయి క్షమాపణలు చెబితే ఆమెను మళ్లీ సంఘంలోకి తీసుకుంటామని తెలిపారు. అయితే తాను రాధారవికి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పనని తేల్చి చెప్పారు.
మీటూ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక పరమైన ఇబ్బందులను పేర్కొంటూ దక్షిణాదిన గాయని చిన్మయి గళమెత్తారు. ఆ సందర్భంలో ఆమె ప్రముఖ రచయిత వైరముత్తు, సీనియర్ నటుడు రాధారవి, సింగర్ కార్తీక్, గాయకుడు మనోలపై ఆరోపణలు కూడా చేశారు. రాధారవిపై చిన్మయి చేసిన ఆరోపణల కారణంగా ఆమెను డబ్బింగ్ యూనియన్ నుండి కూడా తొలగించారు.