సూపర్ మార్కెట్‌లోకి నో ఎంట్రీ.. రాచకొండ సీపీ వార్నింగ్

  • IndiaGlitz, [Saturday,April 11 2020]

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని సూపర్ మార్కెట్ల యాజమాన్యాలు అతి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అదనుగా చేసుకుని గట్టిగా వెనకేసుకోవడంతో పాటు.. ఎవరైనా విదేశీయులుగా అనుమానం వస్తే వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నగరంలోని వనస్థలిపురంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. చూడ్డానికి చైనీయుల్లా కనిపించడంతో మార్కెట్‌కు వెళ్లిన ఇద్దర్ని సూపర్ మార్కెట్ సెక్యూరిటీ గార్డులు అడ్డుకుని.. అనుమతి లేదంటూ భయటికి పంపేశారు. వాస్తవానికి వారు చైనీయులు కాదు.. మన భారతీయులే.. వారిస్వస్థలం మణిపూర్.

కేటీఆర్ రియాక్షన్..

వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు మొదలుకుని అన్ని ఆధారాలు చూపించినప్పటికీ వారి మాటలను అస్సలు లెక్కచేయలేదు. ఇలా ఆ ఇద్దరు వ్యక్తులు, సెక్యూరిటీల మధ్య వాదోపవాదాలు నడిచాయి. చివరికి చేసేదేమీ లేక అక్కడ్నుంచి ఆ ఇద్దరూ వచ్చేశారు. అనంతరం ఈ తంతుకు సంబంధించిన వీడియోను చిత్రీకరించి మంత్రి కేటీఆర్‌తో పాటు పోలీసులు, ఇంకా చాలా మందికి ట్యాగ్ చేస్తూ చూడండి సార్ ఎంత వివక్ష చూపిస్తున్నారో అని జోనాహ్ అనే వ్యక్తి తన మిత్రులకు జరిగిన విషయాన్ని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. వెంటనే స్పందించిన కేటీఆర్.. సూపర్ మార్కెట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. అంతేకాదు.. ఇలాంటి ఘటనలు జరగకుండా కమిషనర్లు, ఎస్పీలకు సూచనలు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

కఠిన చర్యలు తప్పవు..

ఇది రాచకొండ పరిధిలోకి వస్తుంది. వెంటనే ఈ వ్యవహారంపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని.. ఎవరైనా వివక్ష చూపితే 9490617234, డయల్ 100 నెంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సదురు సూపర్ మార్కెట్ స్టోర్ మేనేజర్, ఇద్దరు గార్డ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎఫ్ఐఆర్ 344/2020 ప్రకారం 153, 188, 341 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని మహేష్ భగవత్ హెచ్చరించారు.