వైరల్ పిక్: చిరంజీవిని కలసిన 'రచ్చ' డైరెక్టర్.. ఏం జరుగుతోంది ?

ప్రతిభగల కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడం సంపత్ శైలి. ఏమైంది ఈవేళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది.. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ చిత్రం చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

ఇదిలా ఉండగా తాజాగా సంపత్ నంది మెగాస్టార్ చిరంజీవి కలవడం ఆసక్తిగా మారింది. ఈ సంగతిని సంపత్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. చిరంజీవితో దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నాడు.

'నా జీవితంలో మెగా మెమొరబుల్ డే ఇది. నా దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగింది. మా మధ్యన సంభాషణ అద్భుతంగా జరిగింది. ఆయన వెలకట్టలేని సలహాలు, సూచనలు ఇచ్చారు. మంచిరోజులు ముందున్నాయి' అని సంపత్ ట్వీట్ చేశాడు.

అయితే చిరంజీవిని కలవడానికి గల ప్రధాన కారణాన్ని మాత్రం సంపత్ బయట పెట్టలేదు. దీనితో నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. సంపత్ తదుపరి చిత్రం సీటిమార్ ప్రమోషన్స్ కోసం కలసి ఉంటాడని కొందరు అంటుంటే..మరి కొందరు మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందేమో అని భావిస్తున్నారు.

ఏది ఏమైనా మెగాస్టార్, సంపత్ నంది మీటింగ్ ఇప్పటికైతే సస్పెన్స్. సంపత్ నంది ప్రస్తుతం గోపీచంద్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సీటీ మార్ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.