Race Pre Poll Survey: మళ్లీ గెలిచేది జగనే.. రేస్ ప్రీ పోల్ సర్వేలో స్పష్టం..
- IndiaGlitz, [Saturday,May 11 2024]
ఏపీలో పోలింగ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అయితే ప్రతి సర్వేలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని స్పష్టమవుతోంది. ఇప్పటికే అనేక సర్వేల్లో ఇదే తేలింది. తాజాగా మరో సంస్థ చేసిన సర్వేలోనూ వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తేలింది.
ప్రముఖ సర్వే సంస్థ రేస్ ప్రీ-పోల్ సర్వే.. ఏపీ రాజకీయాలపై తన సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచి మే 8వ తేదీ మధ్యన ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయంగా ఉంది. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ 123 నుంచి 128 అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తుంది. టీడీపీ కూటమి కేవలం 47-52 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని చెప్పుకొచ్చింది. సీఎంగా జగన్ పనితీరుపై 55.10% మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలంటూ 61.20% మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా ఈ సర్వే ప్రకారం సీఎం జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పింది. అలాగే కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ, విద్య, వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల్లో వైసీపీ పాలనపై పెద్ద ఎత్తున సానుకూలత ఉందని వివరించింది. మొత్తానికి ఏపీలో జగన్ పాలనకు తిరుగులేదని.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేసింది.