Raajadhani Files:అమరావతి ఉద్యమం ఆధారంగా.. 'రాజధాని ఫైల్స్' ట్రైలర్ విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వేళ పొలిటికల్ సినిమాల హవా నడుస్తోంది. ఇప్పటికే వైయస్ జగన్ జీవితంలో జరిగిన పరిణామాలతో వ్యూహం, యాత్ర-2 తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో వ్యూహం సినిమా విడుదలకు ఇబ్బందులు తలెత్తగా.. ఈనెల 8న యాత్ర-2 విడుదల కానుంది. తాజాగా అమరావతి రైతుల ఉద్యమం నేపథ్యంలో 'రాజధాని ఫైల్స్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. శ్రీమతి బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
'పరదాల ముఖ్యమంత్రి' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘కష్టపడమని చెప్తే.. ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి’.. ‘ప్రజలెప్పుడూ మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి’అంటూ ముఖ్యమంత్రి పాత్రధారి చెబుతాడు. ‘140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా అనే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. ‘మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. మహా పాదయాత్ర’ అంటూ ఎలాగైనా ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని రైతుల పోరాటాలను ఇందులో చూపించారు.
ఇక ఈ మూవీలో సీనియర్ నటులు వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ నటించారు. ఇక ప్రముఖ సంగీత దర్శకడు మణిశర్మ సంగీతం అందించడం విశేషం. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, సుద్ధాల అశోక్ తేజ గేయ రచయితగా పనిచేశారు. ఫిబ్రవరి 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మూడు రాజధానులు అవసరమని అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు ఒకటే రాజధాని ఉండాలంటూ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే మూవీలో అమరావతి పేరును అయిరావతిగా, ఆంధ్రప్రదేశ్ పేరును అరుణప్రదేశ్‌గా మార్చారు. మరి ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసిన సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి సినిమా విడుదలయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com