Quit Jagan: 'క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ'.. ప్రజలకు చంద్రబాబు పిలుపు..
- IndiaGlitz, [Saturday,March 30 2024]
రాయలసీమలో ట్రెండ్ మారిందని.. ప్రజలు ఇక వైసీపీ బెండు తీసేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. ఎన్నికల్లో 'క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ' అనేది నినాదం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా ప్రొద్టుటూరులో నిర్వహించిన 'ప్రజాగళం' సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్లలో రాయలసీమకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కడప ఎవరి సొత్తు కాదని.. పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మడం లేదని విమర్శించారు.
రాయలసీమ అంటే జగన్‌కు హింస, హత్యా రాజకీయాలు అని తనకు మాత్రం నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురావడం, పెట్టుబడులు, రైతును రాజు చేయడమే అన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే ఎప్పుడో స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేవాడిని అని చంద్రబాబు వెల్లడించారు. కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. అనంతపురానికి కియా పరిశ్రమ తీసుకొచ్చానని అది తన బ్రాండ్ అని.. చేసిన వాటికే శంకుస్థాపనలు చేయం జగన్ బ్రాండ్ అని ఎద్దేవా చేశారు.
రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుందని.. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలనే సంకల్పంతోనే 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఈ జగన్‌కు లేదన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కువైపోయాయని.. తాను అధికారంలోకి వచ్చిన 100 రోజులలో గంజాయి అమ్మేవాడిని భూమిపై ఉంచనని హెచ్చరించారు. తనది విజన్ అయితే జగన్‌ది పాయిజన్ అని సెటైర్లు వేశారు.
ఈ సందర్భంగా ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ.1500.. తల్లికి వందనం పేరుతో రూ.15000 చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని.. ప్రతి ఒక్క రైతుకు ఏడాదికి రూ.20వేల రూపాయలు ఇస్తామన్నారు. అలాగే నిరుద్యోగులకు రూ.3వేలు, వృద్దాప్య పెన్షన్ రూ.4వేలు ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు.