ఎన్‌కౌంటర్‌తో సత్వర న్యాయం లభించింది: పవన్
- IndiaGlitz, [Friday,December 06 2019]
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలోని నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్ బాధితురాలి తల్లిదండ్రులు.. సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీల వరకూ స్వాగతిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. దిశ ఉదంతం కనువిప్పు కావాలి.. బహిరంగ శిక్షలు అమలు చేయాలన్నారు. దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందన్నారు. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోందన్నారు.
సత్వర న్యాయం లభించింది!
‘జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనే. దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంటు తీసుకొచ్చింది. అయినా అత్యాచారాలు ఆగలేదు. అంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని జరుగుతున్న సంఘటనలు తెలుపుతున్నాయి.ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావలసిన అవసరం ఉంది.ఇతర దేశాలలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలి. మేధావులు ముందుకు కదలాలి. వారి ఆలోచన శక్తితో ఇటువంటి నికృష్ట ఘాతుకాలకు చరమాంకంపాడాలి. ఇలాంటి కేసులలో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలి. రెండు మూడు వారాలలోనే శిక్షలు పడేలా నిబంధనలు రావాలి. ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేయడానికి యోచన జరగాలి. నేర స్థాయినిబట్టి అది మరణ శిక్షఅయినా, మరే ఇతర శిక్ష అయినా సరే, బహిరంగంగా అమలు జరపాలి. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించింది. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.