Raghunandan Rao: కేసీఆర్ కుటుంబంలో గొడవలు.. రఘునందన్ సంచలన వ్యాఖ్యలు..
- IndiaGlitz, [Wednesday,January 24 2024]
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనుమతితోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయని.. ఈ స్థానం కోసం కవిత పట్టుబడుతున్నారని ఆరోపణలు చేశారు. అందుకే హరీష్ రావు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు.
పార్టీలో కేటీఆర్, హరీశ్‌రావుకు పడటం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి కోసం కొట్లాటలు జరుగుతున్నాయని తెలిపారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారని.. కానీ పార్టీ పరువు పోతుందనే కారణంతో వారి చేత బలవంతంగా ప్రెస్‌మీట్ పెట్టించారని చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 16 సీట్లు కచ్చితంగా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ జీరో కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
కాగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఇందులో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు ఉన్నారు. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం బీఆర్ఎస్ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. వారు పార్టీ మారునున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. దీంతో ఈ వార్తలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని స్పష్టంచేశారు.
నియోజకవర్గాల అభివృద్ధి కోసం సీఎంను కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు ఎలా అనుకుంటారని నిలదీశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రులను, అధికారులను కలుస్తుంటామని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని.. కేసీఆరే తమ నాయకుడని వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. ఇక నుంచి తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువునష్టం దావా వేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.