భారతీయ మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో బిగ్ డీల్.. పీవీఆర్‌లో విలీనం కానున్న ఐనాక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలోని మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో దిగ్గజాలుగా పేరొందిన పీవీఆర్, ఐనాక్స్ ఒక్కటి కాబోతున్నాయి. ఈ మేరకు విలీన ఒప్పందానికి ఇరు సంస్థల బోర్డులు ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. విలీనానంతరం ఏర్పడే సంస్థకు పీవీఆర్ సీఎండీ అజయ్ బిజ్లీ ఎండీగా కొనసాగనున్నారు. ఇదే సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. అలాగే ఐనాక్స్ గ్రూప్ ఛైర్మన్ పవన్ కుమార్ జైన్ బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, సిద్ధార్థ్ జైన్ నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉండనున్నారు.
అయితే ఈ ఒప్పందానికి ఇంకా పీవీఆర్, ఐనాక్స్ షేర్‌హోల్డర్ల ఆమోదం లభించాల్సి ఉంది. అలాగే స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెబీ, సీసీఐ నుంచి కూడా అనుమతి రావాల్సి వుంది. ఇవన్నీ కార్యరూపం దాల్చిన పక్షంలో పీవీఆర్‌లో ఐనాక్స్ విలీనం అవుతుంది. అంతేకాదు ఐనాక్స్ షేర్ హోల్డర్లందరికీ పీవీఆర్ షేర్లు లభించనున్నాయి. విలీనానంతర ఏర్పడే సంస్థను ‘‘పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్’’గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా ఏర్పడే సంస్థలో పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం వాటా, ఐనాక్స్ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభించనుంది. దేశవ్యాప్తంగా పీవీఆర్‌కు 73 పట్టణాల్లో 181 ప్రాంతాల్లో 871 తెరలు వుండగా... ఐనాక్స్‌కు 72 పట్టణాల్లోని 160 ప్రాంతాల్లో 675 స్క్రీన్‌లున్నాయి. విలీనానంతరం దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఎగ్జిబిషన్ కంపెనీగా పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ అవతరించనుంది. తద్వారా కొత్త సంస్థకు దేశవ్యాప్తంగా 109 పట్టణాల్లో 341 ప్రాంతాల్లో 1,546 తెరలు వుంటాయి. పీవీఆర్‌కు దేశంలోని ఉత్తర, పశ్చిమ, దక్షిణ ప్రాంతంలో బలమైన నెట్‌వర్క్ ఉండగా.. ఐనాక్స్‌కు తూర్పు ప్రాంతంలో స్క్రీన్‌లు వున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments