‘పుష్ప’’ నయా చరిత్ర: రోజులు గడుస్తున్నా డైలాగ్స్ ఇంకా ట్రెండింగ్‌లోనే

  • IndiaGlitz, [Thursday,March 10 2022]

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్‌ ప్రజలను విశేషంగా అలరించాయి. ఎక్కడ చూసినా కూడా పుష్ప పేరు బాగా వినిపించింది.వయసుతో సంబంధం లేకుండా ‘‘తగ్గేదే లే’’ అంటూ పుష్ప సినిమా డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజాన్ని అనుకరించారు. వీరిలో సినీతారలు, క్రీడాకారులు చివరికి రాజకీయ నాయకులు కూడా వున్నారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పలు పార్టీలు ప్రచారానికి పుష్ప సినిమాను వాడుకున్నారు.

పుష్ప సినిమాను భాషతో సంబంధం లేకుండా దేశప్రజలు ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు వసూలు చేయడంతో పాటు హిందీ జనాల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఇకపోతే శ్రీవల్లి హుక్ స్టెప్ 3 మిలియన్ రీల్స్ కు చేరువైంది. కోవిడ్ మహమ్మారికి ముందు బాహుబలి సినిమా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించి వుండొచ్చు.. కానీ రీచ్ పరంగా చూసుకుంటే మాత్రం బాహుబలి కంటే పుష్ప జనాల్లోకి బాగా వెళ్లింది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ భారతీయ సినీ రంగంలో ఆకాశాన్ని చేరింది. ఇప్పటి వరకు దక్షిణాదికి మాత్రమే సుపరిచితుడైన బన్నీ.. ఇప్పుడు ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు.

ఇకపోతే.. పుష్ప పార్ట్ 1 ఇచ్చిన ఉత్సాహంతో ‘‘పుష్ప సెకండ్ పార్ట్’’ను పట్టాలెక్కించే పని మొదలుపెట్టారు మేకర్స్. త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి భాగానికి మించి ఈ సినిమాలో స్టెప్పులు .. ఫైట్లు ఉండాలని సుకుమార్ తో బన్నీ చెప్పినట్లుగా ఫిలింనగర్ టాక్. దాంతో యాక్షన్ కొరియోగ్రఫర్లు .. డాన్స్ కొరియోగ్రఫర్లు కసరత్తు మొదలెట్టారని సమాచారం.