ఆకాష్ కు రొమాంటిక్ ఒక ఇడియట్ లాంటి సినిమా అవుతుంది - పూరి జగన్నాథ్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాదురి తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘ఇంటెన్స్ లవ్ స్టోరీ సినిమా చూసి చాలా రోజులైంది. సినిమా చాలా బాగుంది. మూడేళ్ల తరువాత థియేటర్లో సినిమా చూడటం చాలా బాగుంది. ప్రేమ కన్నా మోహం చాలా గొప్పది.. మోహం నుంచే ప్రేమ పుడుతుంది.. ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ మోహమే అని అనుకుంటారు.. ఈ సినిమాకు అదే ఫ్రెష్‌గా ఉంటుంది. ఆకాష్ మంచి నటుడు అని రాజమౌళి కూడా చెప్పారు. సినిమా చూసిన చాలా మంది ఎమోషనల్ అయ్యారు. థియేటర్ కాకపోతే ఏడ్చేవాళ్లమని చాలా మంది చెప్పారు. ముందే ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చింది. ఇది ఇడియట్ లాంటి సినిమా అని అందరూ అన్నారు. ఆకాష్ మంచి నటుడే. కానీ రొమాన్స్‌లో వీక్. ఇంకా బాగా చేస్తాను అంటే ఇంకా బాగా రాస్తాను. వాడు నన్ను సరిగ్గా వాడుకోవడం లేదు. ఇలాంటి తండ్రి అందరికీ దొరకడు. ఈ చిత్రాన్ని యంగ్ జనరేషన్ తీస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అనిల్‌కు ఇచ్చాను. కథను ఎంతో ప్రేమిస్తే గానీ కూడా అలాంటి ఎమోషన్‌ను క్యారీ చేసేలా తీయడం మామూలు విషయం కాదు. అనిల్ బాగా తీశాడు. దర్శకులందరూ వచ్చి ఈ చిత్రాన్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక మంచి వాతావరణాన్ని క్రియేట్ అయ్యేలా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ గారు కూడా సినిమా చూస్తే బాగుండేది. మళ్లీ నా మీద షాంపైన్ పోసేవారు. ఆయన ఏలూరులో షూటింగ్‌లో ఉన్నారు. అందుకే రాలేకపోయారు. నటుడిగా ఆకాష్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ఇది పెద్ద హీరో కథ. కానీ ఆకాష్ బాగా హోల్డ్ చేశాడు. బయట సినిమాలు చేయనివ్వు.. కొంచెం పేరు వచ్చాక. మనం చేద్దామని ఆకాష్ అన్నాడు. సినిమా విడుదలవుతుందని తెలిసి.. ప్రభాస్ ఫోన్ చేశాడు. డార్లింగ్ మనం ఏం చేద్దాం.. ఎలా ప్రమోట్ చేద్దామని అన్నారు. ఇక విజయ్ కూడా వరంగల్లో ఫంక్షన్ పెడదామని అన్నారు. వారిద్దరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు’ అని అన్నారు.
ఛార్మీ మాట్లాడుతూ.. ‘సినిమా ఇంత బాగుంటుందా? ఇంత భారీ ఎత్తున తీశారా? అని అందరూ అన్నారు. లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా బాగున్నాయి. అన్నీ మరిచిపోయి క్లైమాక్స్‌ను చూస్తారు. మా చిత్రయూనిట్ ఎంతో కష్టపడటం వల్లే రొమాంటిక్ సినిమా ఇంత బాగా వచ్చింది. జునైద్ గారు ఎప్పుడంటే అప్పుడు వచ్చి పనిచేశారు. డీఓపీ నరేష్ ఎంతో సహనంగా ఉన్నారు. ఆర్ట్ డైరెక్టర్ జానీ మా ఫ్యామిలీ మెంబర్. ఆయన్ను ఏమీ అడిగినా ఇచ్చేస్తారు. ఒరిజినల్ బీచ్ కావాలన్నా, క్రియేటెడ్ బీచ్ కావాలన్నా ఇస్తారు. సునీల్ గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. అనిల్ అయితే ఆయన పనులన్నీ పక్కన పెట్టేశాడు. సినిమా కోసం పని చేశాడు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ కేతిక గురించి అడిగారు. నటిగా ఈ సినిమా ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. మనల్ని నెత్తి మీదపెట్టుకుని చూస్తారు. ఆకాష్ అద్భుతంగా నటించాడు. ఇది మా అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఇది మాకు చావో రేవో అనే సినిమా ఉండేది. కానీ నిన్న అందరూ సినిమా గురించి మాట్లాడాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. సినిమాను ఇంతలా ప్రమోట్ చేసిన ప్రభాస్, విజయ్ దేవరకొండలకు థ్యాంక్స్’ అని అన్నారు.
కేతిక శర్మ మాట్లాడుతూ.. ‘ఆకాష్ గురించి ఫిర్యాదులు ఏమీ లేవు. ఆయన నటనకు మ్యాచ్ అయ్యేలా పని చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా కోసం డైలాగ్స్ చాలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. రేపు థియేటర్స్ లోనే సినిమా చూడండి’ అని అన్నారు.
అనిల్ పాదురి మాట్లాడుతూ.. ‘ఆకాష్ వయస్సుకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తీయడమే నాకు పెద్ద చాలెంజ్. వీఎఫ్ఎక్స్‌లో పని చేశాను. గోవాను ఇంత వరకు చూడని లొకేషన్స్ చూపించాలని అనుకున్నాను. రమ్యకృష్ణ గారు అయితే పాత్ర బాగుంటుందని అనుకున్నాం. అనుకున్నట్టుగానే రమ్యకృష్ణ గారు బ్యాక్ బోన్ అయ్యారు’ అని అన్నారు.
ఆకాష్ మాట్లాడుతూ.. ‘నాన్న గారి డైలాగ్స్ చెప్పాలని నాకు ఇష్టమే. ఈ చిత్రంలో చాలా డైలాగ్స్ ఉన్నాయి. అవన్నీ చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ రోజూ ఏదో ఒకటి నేర్చుకున్నాను. ఈ పాత్ర చాలా సాలిడ్‌గా ఉంటుంది. ఇది కచ్చితంగా బాగా చేయాలని ఫిక్స్ అయ్యాను. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా గుర్తుండిపోవాలని అనుకున్నాను. ఈ సినిమాకు నా వాయిస్ ప్లస్ అవుతుందని అందరూ అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. మీ నాన్న డబ్బింగ్ చెప్పారా? అని అన్నారు. సినిమా చూసిన అందరూ కూడా అదే అన్నారు. చంటిగాడు సినిమా చూసినప్పుడు చంటిగాడిలా ఉండేవాడిని. అలా నాన్న తీసిన సినిమాలు,హీరోల ప్రభావం నా మీద ఎక్కువగా ఉంటుంది. మా నాన్నకు ఓ హిట్ సినిమా ఇవ్వాలి. అదే నా లక్ష్యం. వాస్కోడిగామా పాత్రనే సెకండ్ పార్ట్‌గా తీయాలనే కోరికగా ఉంది’ అని అన్నారు.
సునయన మాట్లాడుతూ.. ‘నేను బాగా చేయడం గొప్ప కాదు.. నాకు ఈ అవకాశం రావడం గొప్ప. నేను రోల్ చేయడం గొప్ప కాదు. ఎలివేట్ అవ్వడం గొప్ప. ఈ చిత్రం అందరి మధ్య కూర్చుని ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇది వేరే లెవెల్‌లో ఉండబోతోంది. అక్టోబర్ 29న థియేటర్లోకి సినిమా రాబోతోంది’ అని అన్నారు.
రవి మాట్లాడుతూ.. ‘నేను స్టైలీష్ విలన్ అవ్వాలని అనుకున్నాను. కానీ అలా చూపించేవారు ఎవరా? అని అనుకున్నాను. కానీ పూరి గారి కంటే బెటర్‌గా ఎవ్వరూ చూపించలేరు. అనిల్, పూరి గారు నన్ను అద్భుతంగా చూపించారు. ఆకాష్ అద్బుతంగా నటించారు. ఆయన నటన రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. కేతిక శర్మ ఎక్స్ ప్రెషన్స్, నటన అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments