సంచలన నిర్ణయం తీసుకున్న పూరి, ఛార్మి
- IndiaGlitz, [Friday,September 27 2019]
ఈ ఏడాది విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్'తో హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ హిట్ కొట్టారు. ఈ సినిమా కమర్షియల్ భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు పూరి, చార్మి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ తరపున ఓ అధికారిక ప్రకటనను వెలువరించారు.
''సినిమాతో మమేకమై ఉండే ప్రతి ఒక్కరిపై మాకు అపారమైన గౌరవం ఉంది. సినిమా అనేది వ్యాపారమే. నిర్మాత కూడా దర్శకుడి ప్రతిభను నమ్మే సినిమా చేస్తాడు. దర్శకుడి మేధస్సు, సృజనాత్మకత, అవిశ్రాంతమైన శ్రమకు ప్రతి రూపం సినిమా. ఒక దర్శకుడికి సినిమా అవకాశం వస్తే..ఎంతో మందికి పని దొరుకుతుంది. అందుకనే దర్శకులు, దర్శకత్వ శాఖ బావుండాలని కోరుకుంటున్నాం. విజయాలు, అపజయాలు సహజం. అయినా సినిమానే నమ్ముకుని మనదైన రోజు కోసం ఎదురుచూస్తుంటాం. దర్శకత్వ శాఖలోని మనవాళ్లు కొందరు పనిలేకనో, సినిమాలు చేసే అవకాశం రాకనో ఖాళీగా ఉండి ఇబ్బందులు పడటం చూసి మా మనసుకు కష్టం అనిపించింది. అందురూ బావుండాలని కళ్లు మూసుకుని దేవుడ్ని ప్రార్థించడం కన్నా కొందరికి కొంతలో కొంతయిన ఆర్థికంగా సహాయం చేయాలనిపించింది. చిత్ర పరిశ్రమ అందించిన 'ఇస్మార్ట్ శంకర్' అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవాలనిపించింది. ఒకప్పుడు సినిమాలు చేసి ప్రస్తుతం పని లేకుండా ఖాళీగా ఉండి తమ జీవితాలను సినిమాకు అంకితం చేసి కష్టపడి పనిచేసిన డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ 20 మందికి మావంతు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం. ప్రేమతో అంగీకరించండి. ఇదేమీ పెద్ద సహాయం కాదు. చిన్నచిరునవ్వులాంటి పలకరింపు అంతే! మా చిన్న సహాయం మీకు ఏ మాత్రం ఊరటనిచ్చినా చాలు.. అది మా ప్రయాణానికి ఆశీస్సులుగా భావిస్తున్నాం. మేము తలపెట్టే ఇలాంటి ఓ మంచి కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మేం బ్రతికి ఉన్నంత కాలం ఇదే విధంగా దేవుడు శక్తి ఇచ్చినట్టయితే ప్రతి సంవత్సరం ఇలాగే సహాయం చేయాలనుకుంటున్నాం'' అన్నారు.
సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు.