చంద్రబాబుకు చురకలంటించిన పురందేశ్వరి..!
Send us your feedback to audioarticles@vaarta.com
దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరికపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని.. వాళ్లు మారని పార్టీలు లేవని.. ఆర్‌ఎస్‌ఎస్ మొదలు అన్నిపార్టీల చుట్టూ దగ్గుబాటి ప్రదక్షిణలు చేశారంటూ సీఎం కన్నెర్రజేశారు. అంతటితో ఆగని ఆయన.. కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి తర్వాత కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లారని.. ఇప్పుడు దగ్గుబాటి మళ్లీ వైసీపీ గూటికి చేరారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారని.. అవకాశవాదులంతా వైసీపీ గూటికి చేరారని బాబు సెలవిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఆ నోటా ఈ నోటా పడి దగ్గుబాటి ఫ్యామిలీ చెవిన పడటంతో ఎట్టకేలకు స్పందించారు. చంద్రబాబు విమర్శలకు పిన్ టూ పిన్ ఆమె కౌంటర్ల వర్షం కురిపించారు.
కనుక్కో.. కిల్లీనే సాక్ష్యం..!
"విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏమీ చేయలేదని అంటున్నవాళ్లు.. టీడీపీ అధినేత ఏం చేశారో తెలుసా?. రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇవ్వడం తప్ప ఏమీ చేయలేదు. కనీసం పోలవరం గురించి కూడా అడగలేదు. నామాటలని కాదు కానీ.. ఒక్కసారి ఆ లేఖ చూడండి. బిల్లులోని ప్రతి విషయం కోసం పోరాడనని.. నేను గర్వంగా చెప్పగలను. ఈ విషయంలో కిల్లీ కృపారాణి లాంటి వాళ్లే సాక్ష్యులు" అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
అప్పుడు ప్రశ్నించలేదు.. అందుకే ఇప్పుడు!
"ఇక కాంగ్రెస్ ప్రవేశంపై మాట్లాడుకుంటే.. పార్టీలో మేముండకూడదని టీడీపీ అధినాయకత్వం భావించినప్పుడు.. మేము ప్రజా జీవితాన్ని మర్చిపోవాలా?. నా కేడర్‌ని దగ్గుబాటి కాపాడుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. నా రాజకీయ ప్రవేశం ఎలాంటి ప్రణాళిక లేకుండానే జరిగిపోయింది. దీన్నినేను దేవుడిచ్చిన అవకాశంగానే భావిస్తున్నాను. దానికి న్యాయం చేయడానికి శాయశక్తులా ప్రయత్నించాను. కానీ కాంగ్రెస్‌తో టీడీపీ కలవడం మాత్రం మొత్తం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే జరిగింది. కానీ దాన్ని నేను ఎప్పుడూ ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను.. తాత్కాలిక ప్రయోజనాల కోసం సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలు కలవొచ్చా? ఏ కుటుంబంలోనైనా భిన్న అంశాలపై భిన్నమైన అభిప్రాయాలు ఉంటుంటాయి"అని చంద్రబాబుపై దగ్గుబాటి కౌంటర్ల వర్షం కురిపించారు.
రామ్ మాధవ్‌తో మాట్లాడా..!
"నా కుమారుడికి సొంత అభిప్రాయాలున్నాయి. పార్టీలో చేరడంపై నా అభిప్రాయాన్ని చెప్పాను. నా కుమారుడికి నా నిర్ణయాన్ని తీసుకున్నాడు. హితేశ్ నిర్ణయాన్ని రామ్ మాధవ్‌కి చెప్పాను. రాజకీయాల నుంచి విరమించుకుంటున్న విషయం కూడా ఆయనతో వివరించాను. కానీ ఆయన దాన్ని తోసిపుచ్చారు. మీరు రాజకీయాల్లో కొనసాగాల్సిందేనని గట్టిగా పట్టుబట్టారు. ఆ మాటకు నా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రెండు పార్టీలకు ఈ విషయాన్ని ముడిపెట్టి చెప్పడం.. వారి ఆలోచనను తెలియజేస్తోంది" అని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
నా కుటుంబాన్ని ప్రేమిస్తా..!
"కూకట్‌పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేసినప్పుడు ఆమె ఇంటికి వెళ్లి ఆశీర్వదించి వచ్చాను. ఆమె ఓడిపోయినప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పాను. ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉండొచ్చుగానీ.. రాజకీయాలకు అతీతంగా నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు లేవు. దయచేసి నా పిల్లలు, కుటుంబానికి సంబంధించిన సున్నితమైన .. వ్యక్తిగత అంశాల జోలికెళ్లకండి" అని నెటిజన్లు, విమర్శకులకు దగ్గుబాటి విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ వ్యవహారంపై ఇకనైనా నెటిజన్లు, విమర్శకులు మిన్నకుంటారా..? ఎంత చెప్పినా.. ఏం చేసినా మేమింతే అన్నట్లుగా ముందుకెళ్తే ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులిక. పురందేశ్వరి కౌంటర్లకు తెలుగు తమ్ముళ్లు, సీఎం చంద్రబాబు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout