Purandeswari:ఏపీలో జనసేన-బీజేపీ కలిపి పోటీ చేస్తాయి: పురదేంశ్వరి

  • IndiaGlitz, [Friday,November 17 2023]

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నామని.. అయితే టీడీపీతో పొత్తుపై అధిష్టానం ఎన్నికల ముందు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. వైసీపీ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రభుత్వం గాలికొదిలేసి కక్ష పూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని విమర్శించారు. ఏపీలో కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.

జనసేన పార్టీతో కలిసి వెళ్తామని పురందేశ్వరి పదే పదే చెబుతున్నప్పటికీ.. జనేసన పార్టీ మాత్రం ఇప్పటికే టీడీపీతో పొత్తును ఖరారు చేసుకుంది. సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేలా కార్యచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడా బీజేపీని కలుపుకోవడం లేదు. కానీ పురందేశ్వరి మాత్రం జనసేనతోనే తమ పొత్తు అని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వెల్లవెత్తుతున్నాయి.

తెలంగాణలో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఏ రాష్ట్రం రాజకీయాలు ఆ రాష్ట్రంలో అన్నట్లు ప్రస్తుతానికి పవన్ కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుంది. కానీ ఇంతవరకు మాత్రం సరైన ప్రచారం నిర్వహించడం లేదు. అటు బీజేపీ శ్రేణులు కూడా వీరికి సహకరించడం లేదు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు. అటు బీజేపీ తరపున కూడా ఆయన ప్రచారం చేయడం లేదు. దీంతో ఈ రెండు పార్టీలు పొత్తు ఎందుకు పెట్టుకున్నాయో అర్థః కాని పరిస్థితి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగా ఏపీలో టీడీపీపై బీజేపీ పొత్తు గురించి క్లారిటీ రానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.