Amritpal Singh:100 కార్లతో వెంటాడినా పరార్, అమృత్‌పాల్ కోసం ముమ్మరవేట.. పంజాబ్‌లో ఏం జరుగుతోంది..?
Send us your feedback to audioarticles@vaarta.com
అమృత్‌పాల్ సింగ్.. ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్‌తో దశాబ్ధాలుగా వున్న ‘ఖలిస్తాన్’ ఉద్యమాన్ని ఇతను పైకి తీసుకొస్తున్నాడు. అతని చర్యలు హింసాత్మకంగా వుండటంతో కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దీనిలో భాగం అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేసేందుకు పథకాన్ని అమలు చేశాయి. దీనిలో భాగంగా గత శనివారం దాదాపు 100 కార్లతో అతనిని వెంబడించాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు మోహరించడంతో పాటు ఇంటర్నెట్, ఎస్ఎంస్ సేవలను నిలిపివేశారు. అయితే పోలీసులకు చిక్కినట్లే చిక్కిన అమృత్‌పాల్ చివరి నిమిషంలో తప్పించుకున్నాడు. రెండ్రోజులు గడుస్తున్నా అతని జాడ తెలియరాలేదు. ఈ క్రమంలో పంజాబ్‌లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానంగా కనిపించిన ప్రతి వాహహనాన్ని సోదా చేస్తున్నారు. ఇప్పటి వరకు 112 మంది అమృత్‌పాల్ అనుచరులు, మద్ధతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. భార్య సాయంతో అమృత్‌పాల్ సింగ్ నేపాల్ మీదుగా కెనడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్‌ను అప్రమత్తం చేసింది.
ఎవరీ అమృత్‌పాల్ :
29 ఏళ్ల అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లా జల్లూపూర్ ఖేడాకు చెందినవాడు. ఏడాది క్రితం వరకు ఇతను ఎవరికీ తెలియదు. గతంలో కనీసం తలపాగా సైతం ధరించేవాడు కాదు. తమ బంధువుల సంస్థలో పనిచేసేందుకు గాను 2012లో దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో అమృత్‌పాల్‌కు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పడ్డాయి. అలాగే పాక్‌కు చెందిన ఖలిస్తాన్ నేత లఖ్‌బీర్ సింగ్ రోడే సోదరుడు జస్వంత్, టెర్రరిస్ట్ పరమ్‌జీత్ జింగ్ పమ్మాతోనూ అమృత్‌పాల్‌కు పరిచయాలు ఏర్పడ్డాయి. అనంతరం అతనికి ఐఎస్ఐ జార్జియాలో శిక్షణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఐఎస్ఐ బ్రెయిన్ వాష్‌తో పంజాబ్‌లో కల్లోలాన్ని సృష్టించేందుకు భారత్‌లో అడుగుపెట్టాడు. ఇతనికి కావాల్సిన నిధులు, ఆయుధాలను ఐఎస్ఐ డ్రోన్ల ద్వారా పంజాబ్ సరిహద్దుల్లో విడిచిపెట్టేది. అలా సొంతంగా ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ (ఏకేఎఫ్) పేరిట అమృత్‌పాల్ సొంతంగా ఓ ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
దీప్ సిద్ధూ మరణంతో ‘‘వారిస్ పంజాబ్ దే’’ నాదేనన్న అమృత్‌పాల్ :
అనంతర కాలంలో సింగర్, నటుడు దీప్ సిద్ధూ స్థాపించిన ‘‘వారిస్ పంజాబ్ దే’’ సంస్థలో అమృత్‌పాల్ చేరాడు. అయితే రోడ్డు ప్రమాదంలో దీప్ సిద్దూ ప్రాణాలు కోల్పోవడంతో ‘‘వారిస్ పంజాబ్ దే’’ సంస్థను హైజాక్ చేశాడు. ఆ సంస్థ తనదేనని ప్రకటించుకుని.. అనుచరులకు ఆదేశాలివ్వడం మొదలుపెట్టాడు. మత బోధనల పేరిట యువతను ఖలిస్తాన్ ఉగ్రవాదులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ప్రధాన అనుచరుడు లవ్‌ప్రీత్ తుఫాన్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఏకంగా వందలాది మంది మద్ధతుదారులతో అనాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన పోలీసులు చేసేది లేక లవ్‌ప్రీత్‌ను వదిలిపెట్టాల్సి వచ్చింది. అతని దూకుడు ఖలిస్తాన్ ఉద్యమనేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలా తరహాలో వుండటంతో అమృత్‌పాల్ అక్కడ హీరోగా మారిపోయాడు. అలాగే సైలెంట్‌గా వున్న ఖలిస్తానీ సానుభూతిపరులను కూడా ఆకర్షించి, అతని మద్ధతుదారులుగా మారిపోతున్నారు.
అసలేంటీ ఖలిస్తాన్ ఉద్యమం:
భారత్- పాక్ విభజన సమయంలోనే సిక్కులు కూడా తమకు ప్రత్యేక దేశం కావాలంటూ ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఖలిస్తాన్ అంటే పవిత్రమైన భూమి అని అర్ధం. ఈ క్రమంలోనే దేశ విభజన జరగడం పంజాబ్ రెండు ముక్కలు కావడం వేగంగా జరిగిపోయింది. మనదేశంలో వున్న పంజాబ్ కూడా హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. దీంతో ఖలిస్తాన్ ఉద్యమం నీరుగారిపోయింది. ఈ క్రమంలో జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలా రాకతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆయన ఉపన్యాసాలు, ఆహార్యానికి నాటి సిక్కు యువత ఊగిపోయింది. 1970-80 ప్రాంతంలో పంజాబ్‌లో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగిన భింద్రన్‌వాలా ఏకంగా కేంద్రాన్నే సవాల్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని అడ్డాగా మార్చుకుని సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేశాడు.
ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశించిన ఇందిరా గాంధీ :
దీనికి తోడు పంజాబ్‌లో అల్లర్లు, మత కల్లోలాలు, సిక్కేతర వ్యక్తులను హత్యలు చేయడం వంటి ఘటనలతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఉగ్రవాదులను ఏరిపారేయ్యాల్సిందిగా భారత సైన్యాన్ని ఆదేశించారు. దీంతో ఆర్మీ 1984 జూన్ 1 నుంచి 10 వరకు ‘‘ ఆపరేషన్ బ్లూ స్టార్’’ పేరుతో స్వర్ణ దేవాలయంపై విరుచుకుపడింది. ఈ ఘటనలో జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలా సహా వందలాది మంది ఉగ్రవాదులు, సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సిక్కులు ప్రతీకారం కోసం రగిలిపోయారు. ఈ క్రమంలోనే నాటి ప్రధాని ఇందిరా గాంధీని సొంత అంగరక్షకులే కాల్చిచంపారు. ఇందిర హత్యతో దేశవ్యాప్తంగా సిక్కులపై మారణహోమం జరిగింది. సిక్కు మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలతో పాటు ఆస్తుల ధ్వంసం, హత్యలు వంటివి జరిగాయి. ఆ తర్వాత కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుని ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణిచివేశాయి. మళ్లీ అమృత్‌పాల్ ద్వారా ఇన్నాళ్లకు అది లేచినట్టే కనిపిస్తోంది. అయితే ఇది ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com