తాగుబోతన్నారు.. ఇప్పుడాయనే కాబోయే పంజాబ్ సీఎం, ‘‘జిలేబీ’’లు సిద్ధం

  • IndiaGlitz, [Thursday,March 10 2022]

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్ వంటి దిగ్గజ పార్టీలను మట్టికరిపించి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ఉదయం 11 గంటల నాటికి వెలువడిన ఫలితాల ప్రకారం.. అప్ ఏకంగా 89 స్థానాల్లో ముందంజలో వుంది. దీంతో ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉండటంతో సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలకు పంచేందుకు గాను నేతలు జిలేబీలు సిద్ధం చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

ఈ ఏడాది జనవరి 18న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ సింగ్‌ను ప్రకటించింది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సీఎం అభ్యర్థిని ఎంపిక చేశామని, వాట్సాప్, మిస్డ్ కాల్, ఎస్సెమ్మెస్ తదితర మార్గాల్లో ప్రజలు తమ అభిమాన నేతను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. భగవంత్ మాన్‌కు 93.3 శాతం మంది ప్రజలు మద్దతు పలికారని ఆయన వెల్లడించారు.

పంజాబీ స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన భగవంత్ మాన్ 2014 మార్చిలో ఆప్‌ తీర్ధం పుచ్చుకున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్ నియోజక వర్గం నుంచి ఎంపీగా వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం పంజాబ్ ఆప్ అధ్యక్షుడిగా కూడా మాన్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తనను తాగుబోతు అంటూ ప్రత్యర్ధి పార్టీలు చేస్తోన్న విమర్శలపై స్పందిస్తూ మద్యం మానేశానని, ప్రజాప్రతినిధిగా, పంజాబ్ సీఎంగా బాధ్యతగా నడుచుకుంటానని ఎన్నికల ప్రచారంలో మాన్ తెలిపారు. ఆయన మాటపై నమ్మకం వుంచిన ఓటర్లు ఆప్ అభ్యర్ధులకు విజయాలు కట్టబెడుతున్నారు.