కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత.. సీఎం అధికారిక ప్రకటన
- IndiaGlitz, [Friday,October 29 2021]
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తోన్న సమయంలో పునీత్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు తొలుత బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. పునీత్ ఆరోగ్యం గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.
పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్, కన్నడ నటీనటులు ఆస్పత్రికి చేరుకున్నారు. మరోవైపు పునీత్ అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలివస్తున్నారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మూడో కుమారుడే పునీత్ రాజ్‌కుమార్. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్.. అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్ సుపరిచితమే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. ఇటీవల ఆయన హీరోగా నటించిన ‘యువరత్న’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
పునీత్ రాజ్‌కుమార్ బాలనటుడిగా సుమారు 14 సినిమాల్లో నటించారు. 2002లో ‘అప్పు’ (తెలుగులో ‘ఇడియట్’)తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస బ్లాక్ దూసుకుపోయారు పునీత్. ‘వీర కన్నడిత’, ‘అరసు’, ‘మిలనా’, ‘వంశీ’, ‘రాజ్’, ‘జాకీ’, ‘హుడుగరు’, ‘అన్నా బాండ్’, ‘యారే కూగడాలి’, ‘పవర్’, ‘దొడ్డమానే హుడుగ’, ‘రాజకుమార’, ‘యువరత్న’ తదితర సినిమాలతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు పునీత్ రాజ్‌కుమార్. నటన మాత్రమే కాకుండా నిర్మాతగానూ సినిమాలు రూపొందించారు. డ్యాన్స్ ఆధారిత టీవీ కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు.