PSV Garuda Vega Review
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అంశం అణుయుద్ధం. ఈ అణుపోరాటంలో ఓ కీలమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన చిత్రమే 'పిఎస్‌వి గరుడవేగ 126.18 ఎం'. ఆసక్తికరమైన విషయమేమంటే..రెండేళ్ల గ్యాప్ తర్వాత డా.రాజశేఖర్ ఈ సినిమాలో హీరోగా నటించడం. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ మరోసారి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాలను సినిమాను అందుకుందా? లేదా? రాజశేఖర్‌కు ఈ సినిమా కమ్‌బ్యాక్ మూవీ అవుతుందా? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ:
శేఖర్(డా.రాజశేఖర్) ఎన్‌ఐఏ ఆఫీసర్. విధి నిర్వహణలో భాగంగా తను చేసే పని గురించి భార్యకు తాను ఓ సాధారణ పోలీసు అధికారినని చెప్పుకుంటాడు. అయితే సీక్రెట్ ఆపరేషన్స్ కారణంగా ..తగినంత సమయాన్ని తన భార్య స్వాతి(పూజా కుమార్)కు కేటాయించలేకపోతాడు. స్వాతి..భర్త ప్రవర్తనకు విసిగిపోయి, తన నుండి విడిపోవాలనుకుంటుంది. అదే సమయంలో, ఓ కేసును టేకప్ చేస్తాడు శేఖర్. ఆ కేసులో తనకి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. కేసును పరిశోధించే క్రమంలో నిరంజన్(ఆరుణ్ అదిత్) అనే టెక్కీని అరెస్ట్ చేస్తాడు. నిరంజన్ తన దగ్గరున్న సీక్రెట్ డేటాను ఎవరికో అమ్మకానికి పెడతాడు. ఆ వ్యక్తి నిరంజన్‌తో పాటు శేఖర్‌ను కూడా చంపాలనుకుంటాడు. అప్పుడు శేఖర్ ఏం చేస్తాడు? నిరంజన్‌ను ఎవరు చంపాలనుకుంటారు? అసలు జార్జ్ ఎవరు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
డా.రాజశేఖర్ నటన సినిమాకు ప్రధాన బలం. సీనియర్ హీరో అయినప్పటికీ యాక్షన్ సీన్స్‌లో రాజశేఖర్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఛేజింగ్ సీన్స్‌తో పాటు సెకండాఫ్‌లో వచ్చే ఫైట్స్ సహా రాజశేఖర్ చాలా ఎనర్జిటిక్‌గా చేశారు. అలాగే భార్యపై ప్రేమను కనపరిచే భర్తగా, విధి నిర్వహణ కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఆఫీసర్‌గా పాత్రలో ఒదిగిపోయాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఓ కాంప్లికేటెడ్ సమస్యను చాలా చక్కగా తెరకెక్కించాడు. ముఖ్యంగా సన్నివేశాలను అల్లిన తీరుని అభినందించాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. అలాగే సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది.
మైనస్ పాయింట్స్:
ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కామెడీనే అనుకునే ప్రేక్షకులకు సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. అలాగే సినిమాలో కొన్ని అనవసరమైన సీన్స్‌ను తొలిగించేయవచ్చు. సినిమా కాన్సెప్ట్ బి, సి సెంటర్స్ ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పలేం. సినిమా ఎడిటింగ్‌లో సిమా లెంగ్త్‌ను కాస్త తగ్గించి ఉండొచ్చు.
విశ్లేషణ:
ఇందులో నటీనటుల విషయానికి వస్తే..రాజశేఖర్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌కు పూజా కుమార్ అతని భార్య పాత్రలో...పాత్రకు న్యాయం చేసింది. అరుణ్ అదిత్ టెక్కీ పాత్రలో మెప్పించాడు. కథంతా ఇతని చుట్టూనే తిరగడం విశేషం. అలాగే మెయిన్ విలన్ పాత్రలో నటించిన కిషోర్ స్టయిలిష్ విలనిజాన్ని తెరపై చూపించాడు. అలాగే రాజకీయ నాయకుల పాత్రల్లో నటించిన షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, డాక్టర్స్ పాత్రలో నటించిన అలీ, పృథ్వీ, ఎన్‌ఐఏ చీఫ్ ఆఫీసర్‌గా నటించిన నాజర్, ఇక ఎన్‌ఐఏ సభ్యులుగా రవివర్మ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే, దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమాను చక్కగా తెరకెక్కించాడు. సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. సినిమా ఫస్ట్ సీన్‌లో వచ్చే బైక్ చేజింగ్ సీన్, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్, జార్జియా డ్యామ్ ఫైట్ సూపర్బ్. బాంబ్ డిస్పోస్ సీన్ సహా పలు సన్నివేశాలు, చేజింగ్ సీన్స్ ప్రేక్షకలను ఆకట్టుకుంటాయి. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందా? అంటే మాత్రం లేదనే చెప్పాలి. అయితే మూస సినిమాలకు భిన్నంగా ఉండే సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులు చూడాల్సిన చిత్రమిది.
బోటమ్ లైన్: గరుడు వేగ...మెప్పించే యాక్షన్ థ్రిల్లర్
PSV Garuda Vega Movie Review in English
- Read in English