PSLV-C58 XPoSat: ఇస్రో న్యూ ఇయర్ గిఫ్ట్.. ఎక్స్‌పోశాట్ ప్రయోగం సక్సెస్

  • IndiaGlitz, [Monday,January 01 2024]

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. దేశ ప్రజలకు నూతన సంవత్సర కానుకను అందించింది. కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. అగ్రరాజ్యం అమెరికా తర్వాత బ్లాక్‌హోల్‌ పరిశోధన కోసం ఎక్స్‌పోశాట్(XPoSat) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహంను పీఎస్ఎల్వీ-సీ58(PSLVC58) రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపించింది.

దాదాపు 25 గంటల కౌంట్‌డౌన్ తర్వాత ఇవాళ(సోమవారం) ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8:10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయంలో రాకెట్ నమూనాకు శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భారత్‌కు చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ ఉపగ్రహం.. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు నిర్ణీత కక్ష్యలోకి చేరుకుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగం భారత అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో కీలకమైన పురోగతికి తొలి అడుగు కానుందని తెలిపారు. ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్‌ లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయోగం ప్రపంచంలోనే రెండోదని మన కంటే ముందు అమెరికాకు చెందిన నాసా.. 2021లో ఐఎక్స్‌పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు వివరించారు.

ఎక్స్‌పోశాట్‌ జీవితకాలం అయిదేళ్లు ఉంటుంది. పల్సర్‌లు, బ్లాక్‌హోల్‌ ఎక్స్‌రే బైనరీలు, యాక్టివ్‌ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్‌ స్టార్స్‌పై అధ్యయనం చేయనుంది. ఈ ప్రయోగంలో కేరళలోని తిరువనంతపురం ఎల్‌బీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఫర్‌ విమెన్‌ కాలేజ్‌ విద్యార్థినులు తయారుచేసిన విమెన్‌ ఇంజినీర్డ్‌ శాటిలైట్‌ సహా వివిధ పేలోడ్‌లు కూడా ఉన్నాయి. కాగా గతేడాది చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్‌తో ఇస్రో.. ప్రపంచంలో సరికొత్త చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే.