అనంతకు 'కియా' తెచ్చిన ఘనత మోదీదే.. ఇదిగో ఆధారాలు!
Send us your feedback to audioarticles@vaarta.com
అనంతకు ‘కియా’ రాకతో నవ్యాంధ్రకు పారిశ్రామిక కళ వచ్చింది..! ‘కియా’ రాక ఓ చరిత్ర..! కరువు జిల్లా అనంతపురం ఇక ఉద్యోగులతో కలకలాడుతుందని అందరూ చెప్పుకుంటున్నారు సరే.. అసలు ఈ కియా కంపెనీ ఏపీకి రావడం వెనుక కీలక పాత్ర పోషించింది ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశేనా..? లేకుంటే టీవీల్లో కనపడని.. తెలుగు పత్రికలు చెప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే ఎస్.. ఈ మొత్తం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ ఒకే ఒక్కరే. కానీ సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్లుగా అనంతకు కియాకు రప్పించడానికి కారకులొకరైతే.. కాదు కాదు మేమేనని చెప్పుకునేదొకరు..? అసలు ఎక్కడో దేశం కాని దేశమైన దక్షిణ కొరియాలో ఉండే కియా సంస్థ అనంతకు ఎలా వచ్చింది..? ఈ ‘అనంత కియా’ కథేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
కియా మోటార్స్ విషయంలో నిజా నిజాలివీ..
2015లో భారత ప్రధాని మోదీ సౌత్ కొరియా పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా శామ్సంగ్, ఎల్జీ, హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్లను కలవడం జరిగింది. ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ‘కియా’ మోటార్స్‌ను భారత్‌లో స్థాపించాలని విజ్ఞప్తి చేశారు. హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడులో ఉన్నందున మొదటి ప్రియారిటీగా తమిళనాడును అనుకుంటున్నామని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పగా.. ఇందుకు మోదీ స్పందిస్తూ ఆంధ్రాలో అయితే బాగుంటుందని చిన్న సలహా ఇచ్చారు. అంతేకాదు తమిళనాడు పొరుగునే ఉంటుందని మీకు రాయితీలు అధికంగా వచ్చే ఏర్పాటు చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కియా కంపెనీ ప్రతినిధులు అంగీకరించి.. ఏపీ మంత్రులను సంప్రదించగా అప్పుడు సంబంధిత మంత్రి, నారా లోకేశ్.. ఒక సారి చంద్రబాబు కూడా సౌత్ కొరియాలో పర్యటించడం జరిగింది.
లోకేశ్ కూడా ఒప్పుకున్నారు..!
ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ప్రధాని మోదీ ఈ కియా మోటార్స్‌ను కేటాయించారని కూడా కమలనాథులు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇది మోదీ వల్లే వచ్చిందని ఒకానొక సందర్భంలో మంత్రి నారా లోకేశ్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక గుజరాత్ విషయానికొస్తే.. ‘కియా’ గుజరాత్లో పెట్టాలని పలువురు వ్యాపార నిపుణులు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే మోదీ రంగంలోకి దిగడంతో ఆ ప్లాంట్ ఆంధ్రాలో పెట్టడానికే మొగ్గుచూపేలా చర్చలు జరిపి సక్సెస్ చేశారు. అనంతకు కియా రావడానికి మోదీనే కారణం బాబోయ్ అని పలుమార్లు మీడియా ముందుకు వచ్చి ఏపీ బీజేపీ నేతలు మొత్తుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. ఇదీ ‘కియా’ ఏపీలోని అనంత జిల్లాకు రావడం వెనకున్న అసలు సిసలైన కథ.
ఇది జరిగే పనేనా..!
ఒక బడా కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ భారతదేశంలో అడుగుపెట్టాలంటే మొదటి ఎవర్ని సంప్రదిస్తుంది..? దేశ స్థాయి ఉన్నతాధికారులనా..? లేకుంటే డైరెక్టుగా రాష్ట్రానికి వచ్చేస్తుందా..? అనే విషయం కనీస అవగాహన ఉన్నవాళ్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రధాని మోదీ పాత్రపై కనీసం తెలుగు మీడియాల్లో ఒక్కటంటే ఒక్క వాఖ్యం కూడా రాయకపోవడం గమనార్హం. అంటే ప్రభుత్వాలు పత్రికాసంస్థలను ఏ రేంజ్లో మేనేజ్ చేస్తున్నాయని విషయం అర్థం చేసుకోవచ్చు. ఇదిగో మోదీ సౌత్ కొరియా పర్యటనకు సంబంధించి ‘బిజినెస్ కొరియా’ 2015 లో మోడీజీ పర్యటన సందర్బంగా వచ్చిన వార్తను ప్రచురించింది. ఈ వార్తకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా.. ఈ కింది లింక్‌ను క్లిక్ చేసి చూడగలరు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments