Prof Kodandaram: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్
Send us your feedback to audioarticles@vaarta.com
గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమకారులకు పెద్ద పీట వేసేలా గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లను ప్రభుత్వం నామినేట్ చేయగా.. తాజాగా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
2023 జూలై 31న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను అప్పటి కేసీఆర్ సర్కార్ గవర్నర్‌కు సిఫారసు చేసింది. అయితే ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరి పేర్లను ఆమోదించలేమని ప్రభుత్వానికి తెలిపారు. దీంతో అప్పటి నుంచి ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోదండరామ్, అమరుల్లాఖాన్ పేర్లను సిఫార్సు చేయగా.. ఆమోదం లభించింది.
తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేసింది. దీంతో ఆయన తెలంగాణ జన సమితి పార్టీని పెట్టుకున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతు ఇచ్చారు. దీంతో కోదండరామ్ లాంటి ప్రొఫెసర్ సేవలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించారు.
కాగా ఇటీవల తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ఎంపిక చేసింది. అయితే మిగతా పార్టీల నుంచి మరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరిద్దరి ఎంపిక ఏకగ్రీవమైంది. తొలుత అద్దంకి దయాకర్ పేరును అధిష్టానం ప్రటించింది. కానీ చివరి నిమిషంలో ఆయనను మార్చి మహేష్‌కుమార్ గౌడ్‌కు అవకాశం ఇచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దయాకర్‌ను వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని భావించడంతోనే అవకాశం ఇవ్వలేదని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. మొత్తానికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout