అమిత్‌షాతో చంద్రబాబు భేటీ వెనుక జనసేనాని.. వ్యూహాల్లో పవన్ నిపుణుడు కాక ఇంకేంటి , విశ్లేషకుల మాట ఇదే
- IndiaGlitz, [Monday,June 05 2023]
ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా ఆయన తను నమ్మిన సిద్ధాంతం దిశగానే అడుగులు వేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ సమస్యలు వున్నా .. తానున్నానంటూ ప్రజల్లో భరోసా నింపారు. అధికారం పక్షం నుంచి విపరీతంగా మాటల దాడి జరుగుతున్నా నిబ్బరంగా భరించారు.
2014 ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీని ప్రకటించిన పవన్ కల్యాణ్ సమయాభావం వల్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీకి మద్ధతు ఇచ్చారు. రాజకీయంగా ఎదగాలంటే కొన్నిసార్లు వ్యూహాత్మకంగా ఆలోచించాలన్న ధోరణిలో ఆయన వ్యవహరించారు. ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో ప్రజల పక్షాన నిలిచారు పవన్ . 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి బైబై చెప్పిన పవన్ కల్యాణ్.. బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా.. ప్రజల తీర్పును శిరసావహించారు పవన్.
మళ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో ఈసారి మాత్రం తాను బలి పశువును కానని.. ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని.. జగన్ ప్రభుత్వం పోవాల్సిందేనని కృతనిశ్చయంతో వున్నారు. టీడీపీ పల్లకిని మోయడానికి తాను సిద్ధంగా లేనన్న ఆయన .. ఎన్నికల్లో వచ్చిన సీట్ల ఆధారంగా సీఎం పదవిని అడుగుదామని శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. వ్యూహం సంగతి తనకు వదిలేసి.. ప్రజలతో మమేకం కావాలని పవన్ కేడర్‌కు పిలుపునిచ్చారు. ఆయన మాత్రం జగన్‌ను ఎదుర్కోనే బలమైన కూటమిని నిర్మించే పనిలో వున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ వ్యవహారశైలిపై పలువురు పెదవి విరుస్తున్నారు. అయితే ఆయన వ్యూహం, సమర్ధతపై ప్రశంసలు కురిపించారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే.నాగేశ్వర్. బీజేపీని టీడీపీకి దగ్గర చేసేందుకు పవన్ కల్యాణ్ చేసిన యత్నాలు ఫలిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సోము వీర్రాజు నుంచి పొత్తుపై సానుకూల ప్రకటనలు, అమిత్ షాతో చంద్రబాబు భేటీ వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని నాగేశ్వర్ తెలిపారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తొలి నుంచి చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి. ఆయన సీఎంగా వున్న రోజుల్లోనూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు జగన్ పట్ల సానకూలంగా వుండేవారని నాగేశ్వర్ గుర్తుచేస్తున్నారు. అలాంటి సోము వీర్రాజు కూడా పొత్తులపై పాజిటివ్‌గా మాట్లాడరంటే ఆయనకు అప్పటి నుంచే బీజేపీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చి వుంటాయని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తు ఖరారయ్యే సూచనలు వున్నాయని.. ముందు తెలంగాణలో ఇది జరుగుతుందని, ఆ వెంటనే ఏపీలోనూ పొత్తు తప్పదని సోము వీర్రాజుకు తెలియడంతోనే ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని నాగేశ్వర్ చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది పవన్ అభిమతమని.. టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం సాధ్యమవుతుందని పవన్ లెక్కలు వేసుకున్నాకే ఈ మాటలు అంటున్నారని నాగేశ్వర్ చెప్పారు. టీడీపీ ఎన్నోసార్లు కలవడానికి సిద్ధమని సంకేతాలిచ్చినా.. బీజేపీ మాత్రం ఇష్టపడలేదని ఆయన గుర్తుచేశారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే వచ్చారని నాగేశ్వర్ ప్రశంసించారు. తెలుగుదేశం వైపు చాలా స్పష్టంగా అడుగులు వేస్తూనే, బీజేపీని వదలకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని నాగేశ్వర్ అన్నారు.
బీజేపీ టీడీపీతో కలవనని అంటున్నా .. జనసేన టీడీపీతో కలవాలని అంత స్పష్టంగా వున్నా.. మరి పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎందుకు తెగదెంపులు చేసుకోలేదని చాలా మందికి డౌట్స్ వచ్చాయన్నారు. బీజేపీ నుంచి రూట్‌మ్యాప్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నానని.. కానీ అటు నుంచి స్పందన లేదని పవన్ తెలిపారని గుర్తుచేశారు. అయితే అమిత్ షా - చంద్రబాబు కలిసిన తర్వాత బహుశా పవన్‌కు క్లారిటీ వుండొచ్చని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. కానీ అందుకు పూర్వమే బీజేపీ పెద్దలతో ఢిల్లీలో పవన్ భేటీ అయిన విషయాన్ని మరచిపోకూడదు. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. అమిత్ షా - చంద్రబాబు కలయిక వెనుక పవన్ డైరెక్షన్ ఖచ్చితంగా వుందని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. తద్వారా ఇక టీడీపీతో బీజేపీ ఎన్నడూ కలిసేది లేదన్న వారిలో సైతం మార్పు వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి దిశగా కీలకమైన అడుగులు పడటంతో పవన్ మంత్రాంగం ఫలిస్తోందని నాగేశ్వర్ కొనియాడారు.