ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్‌కు భార్యావియోగం

  • IndiaGlitz, [Friday,November 06 2020]

ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్‌కు భార్యావియోగం కలిగింది. ఆయన భార్య అంజు ప్రసాద్‌(53) గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆమెను సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అంజు ప్రసాద్ మృతి చెందారు. పీడీవీ ప్రసాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు. పి.డి.వి. ప్రసాద్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు హారిక హాసిని నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

అంజుప్రసాద్ మృతిపై హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ స్పందించింది. పీడీవీ ప్రసాద్ కుటుంబానికి హారికా హాసినీ క్రియేషన్స్ సంస్థ సానుభూతి తెలియజేసింది. ‘‘మా ప్రియమైన స్నేహితుడు, పార్ట్‌నర్ అయిన పీడీవీ ప్రసాద్ భార్య అంజు ప్రసాద్ ఇవాళ మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. పీడీవీ ప్రసాద్, ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయాన్ని ఎదుర్కొనే బలం ఆ కుటుంబానికి చేకూరాలని ఆశిస్తున్నాం’’ అని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది.