Natti Kumar :కొందరికి తెలియదు, కొందరినీ పిలవలేదు.. ఆస్కార్ విజేతలను ఇలాగేనా గౌరవించేది : నట్టి కుమార్ ఆరోపణలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర సీమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డ్‌ని ముద్దాడి దేశానికి కానుక ఇచ్చారు ఎస్ఎస్ రాజమౌళి. అయితే ఇంతటి ఘనత సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్‌కి దక్కాల్సిన స్థాయిలో గౌరవం దక్కలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి తెలుగు సినీ పెద్దలు సైతం సరిగా స్పందించలేదని అభిమానులతో పాటు సినీ రంగానికే చెందిన వారు కూడా మండిపడుతున్నారు. తాజాగా సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించలేదు :
నిన్న టాలీవుడ్ పెద్దల ఆధ్వర్యంలో ఆస్కార్ విజేతలకు నిర్వహించిన సత్కార కార్యక్రమంపై నట్టి కుమార్ స్పందించారు. ఆస్కార్ విజేతలను గౌరవించుకోవడం మంచి విషయమే కానీ.. నిర్వహించే తీరు ఇది కాదన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత లేకుండా సన్మాన కార్యక్రమమా.. ఈ ఈవెంట్‌కు ఏపీ ప్రభుత్వ పెద్దలు రాలేదని, కేవలం సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే హాజరయ్యారని నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల పెద్దలతో సంప్రదింపులు జరిపి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తే బాగుండేదని.. కొందరికి ఈ ఈవెంట్ గురించి తెలియదని , ఇంకొందరికి ఆహ్వానం అందలేదని ఆయన పేర్కొన్నారు.
ఆదాయం ఏపీ నుంచే :
ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి లేకుండా నిర్మాత మండలి నుంచి రూ.25 లక్షలు తీసి ఖర్చు పెట్టారని నట్టి కుమార్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు పలు హామీలు లభిస్తున్నాయని.. కానీ చిన్న సినిమాలకు సరైన ఆదరణ దక్కడం లేదని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమాకు తెలంగాణ కంటే ఏపీ నుంచే అత్యధిక రెవెన్యూ వస్తోందని.. కానీ అన్ని సంస్థలు జీఎస్టీని తెలంగాణ ప్రభుత్వానికి కడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కానీ సినీ పరిశ్రమలో మాత్రం ఏపీ, తెలంగాణ అనే వ్యత్యాసం లేకుండా అంతా కలిసే పనిచేసుకుంటున్నామని నట్టి కుమార్ పేర్కొన్నారు.
విష్ణుకి బదులుగా మాదాల రవి:
ఇప్పటికే లేట్‌గా టాలీవుడ్ స్పందించింది అనుకుంటే మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి డుమ్మా కొట్టం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఆయనకు బదులుగా మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి వేదికపైకి వెళ్లడం గమనార్హం. విదేశాల్లో వున్నందున విష్ణు ఈవెంట్‌కు రాలేకపోయారని తన తరపున ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు అభినందనలు చెప్పమన్నారంటూ మాదాల రవి తెలిపారు.
ఆర్ఆర్ఆర్ టీమ్‌కి గౌరవం దక్కడం లేదన్న కేఎస్ రామారావు :
ఇకపోతే.. ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్ తీసుకొచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్‌ను సరిగా గౌరవించలేదంటూ సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. శనివారం మీడియాతో మాట్లాడిన రామారావు.. ఇది తెలుగువారు గర్వించాల్సిన విషయమన్నారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డుల కంటే ఇది గొప్ప పురస్కారమని రామారావు అన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌ను, అవార్డ్ గ్రహీతలను గొప్పగా సత్కరించాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout