టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఏషియన్ మల్టీప్లెక్స్, థియేటర్స్ అధినేత నారాయణదాస్ నారంగ్ (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఇటీవల హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 9.04 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. నారాయణదాస్ భౌతిక కాయాన్ని మరికొద్దిసేపటిలో స్వగృహానికి తరలించనున్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. నారాయణదాస్ పార్థివ దేహానికి ఈరోజు మధ్యాహ్నం నివాళులు అర్పించనున్నారు. నారాయణదాస్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో లవ్‌స్టోరీ, లక్ష్య సినిమాలను నారాయణదాస్ నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో ఘోస్ట్, ధనుష్‌తో మరో చిత్రం నిర్మిస్తున్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గా చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు అందించారు.
నారాయణ దాస్ నారంగ్ 1946 జులై 27న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. నారంగ్ కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలే కావడం విశేషం. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో నారాయణ్ దాస్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments