శ్రీ ఏడిద నాగేశ్వరరావు.. అద్భుత కళాఖండాలకు కేరాఫ్..
Send us your feedback to audioarticles@vaarta.com
నేడు(శనివారం) ప్రముఖ చలనచిత్ర చిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు 87వ జయంతి. శంకరాభరణం, సాగరసంగమం, స్వయంకృషి, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు, సితార, సీతాకోకచిలుక తదితర కళాత్మక దృశ్య కావ్యాలను ఏడిద నాగేశ్వరరావు ప్రపంచానికి అందించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం.
కాలేజీ రోజుల నుంచి నాటక అనుభవం ఉన్నందున, ఆయన దృష్టి నటనపై పడింది. వెంటనే మద్రాస్‌కు పయనమయ్యారు. కానీ అక్కడ ఆయనకు నిరాశే మిగిలింది. ఇక చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ, నానా కష్టాలూ పడుతూ జీవితాన్ని కొనసాగించారు. ఆ సమయంలోనే తన మిత్రుల ప్రోత్సాహంతో 1976లో ‘సిరి సిరి మువ్వ’ చిత్రాన్ని నిర్మించి మంచి సక్సెస్ సాధించారు. ఆ విజయం ఇఛ్చిన ఉత్సాహంతో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా ‘తాయారమ్మ బంగారయ్య’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తదుపరి చిత్రం కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శంకరాభరణం’. తెలుగు చిత్ర ఖ్యాతని ఖండాంతరాలకు తీసుకు వెళ్లిన అద్భుత కావ్యం. ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతలు కానీ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ గానీ, జాతీయ - అంతర్జాతీయ - రాష్ట్ర అవార్డులు కానీ ఏ చిత్రానికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం పొందిన మొట్ట మొదటి చిత్రం ‘శంకరాభరణం’ కావడం విశేషం. ఆ సమయంలో ఏ దేశం వెళ్లినా ‘శంకరాభరణం’ సినిమా గురించే ప్రస్తావన ఉండేది. ఆ తర్వాత వచ్చిన ‘సీతాకోకచిలుక’ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమ కథా చిత్రాలకు సీతాకోకచిలుక చిత్రమే ఇన్స్పిరేషన్ అనడంలో సందేహం లేదు.
సీతాకోకచిలుక సైతం మంచి విజయాన్ని సాధించింది. ఏడిద నిర్మించిన తదుపరి చిత్రం, కమలహాసన్ కె.విశ్వనాధ్ కాంబినేషన్లో వచ్చిన ‘సాగర సంగమం’. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అవార్డులతో పాటు ఈ చిత్రం ఎన్నో రివార్డులను సైతం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళంలో ఒకే సారి విడుదలయ్యి సూపర్ హిట్ కొట్టింది. తదుపరి చిత్రం మరో క్లాసిక్ - ‘సితార’. ఏడిద వద్ద అప్పటి వరకూ అన్ని చిత్రాలకూ డైరెక్షన్ డిపార్ట్మెంట్మెంటులో పనిచేసిన వంశీ దర్శకత్వంలో సుమన్, భానుప్రియ జంటగా వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రమిది. సితారకి కూడా జాతీయ అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది. ఇక ‘స్వాతిముత్యం’ - కే.విశ్వనాథ్, కమలహాసన్ రాధికల కాంబినేషన్లో వచ్చిన ఆణిముత్యం. 1986 లో విడులయ్యిన ఈ చిత్రం, అప్పటికి బాక్సాఫీస్ రికార్డులని బీట్ చేసింది. జాతీయ అవార్డు, రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ సినిమా.. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుకు సైతం భారత దేశం తరపున ఎన్నుకోబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రం కావడం విశేషం. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘స్వయంకృషి’. మెగాస్టార్ చిరంజీవితో ఏ కమర్షియల్ చిత్రమో తియ్యకుండా, ఓ సాధారణ చెప్పులు కొట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తియ్యడం పెద్ద సాహసమే. ఈ చిత్రాన్ని సైతం విజయవంతం చేసి ఏడిద నాగేశ్వరరావు అందరి మన్ననలూ పొందారు.
మంచి విజయం సాధించిన ఈ చిత్రం, చిరంజీవికి మొట్ట మొదటి సారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు తెచ్చిపెట్టిన చిత్రం ‘స్వయంకృషి’ కావడం విశేషం. ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరాం హీరోగా చేసిన ‘స్వరకల్పన’ ఆశించనంతగా ఆడలేదు. మళ్ళీ విశ్వనాథ్ - చిరంజీవిలతో కలిసి తీసిన చిత్రం ‘ఆపద్బాంధవుడు’. చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ. రెండవ సారి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటుడిగా చిరుకి నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా. అలాగే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో మిస్ అయ్యింది. ఇన్ని గొప్ప చిత్రాలు నిర్మించడానికి సాహసించిన ఏడిద నాగేశ్వరరావుకు, మన ప్రభుత్వం తరపున సరైన గుర్తింపు లభించలేదంటే సినీ అభిమానులకు చాలా నిరాశే. పద్మ అవార్డుల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డుకి కానీ ఆయన అన్నివిధాలా అర్హులే. కనీసం కీర్తిశేషులైన తర్వాతైనా ఆయనకి తగిన విధముగా గుర్తింపును మన తెలుగు ప్రభుత్వాలు అందిస్తే, చిత్ర సీమలో ఆయన చిత్రాలు ఎలాగైతే మరపురాని ఆణిముత్యాల్లా మిగిలాయో, అలాగే ఆయన కీర్తి ప్రతిష్టలను గౌరవించిన వారౌతారని సినీ ప్రియులు వాపోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments