ఇళయరాజాపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
మ్యాస్ట్రో ఇళయరాజా ప్రసాద్ ల్యాబ్స్ నుండి తనను బలవంతంగా బయటకు పంపుతున్నారని, తన వాయిద్య పరికరాలను నాశనం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నిర్మాత, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ ప్రసాద్ స్పందిస్తూ... ‘‘పాతిక ఎకరాల భూమిని 1950లో ఎల్.వి.ప్రసాద్‌గారు కొని ప్రసాద్ ల్యాబ్స్‌ను అభివృద్ధి చేశారు. కోడంబాకం ఏరియాలో ఒకప్పుడు సాయంత్రం ఆరు దాటితే జనాలు వెళ్లడానికి భయపడేవారు. అలాంటి ఏరియాలో ఎల్.వి.ప్రసాద్‌గారు, ఎ.వి.మెయ్యప్పన్గారు, నాగిరెడ్డి చక్రపాణిగారు స్టూడియోలు కట్టారు. ఎన్నో కష్టనష్టాలకు కోర్చి స్టూడియోలను నిర్మించారు. ఈ మూడు స్టూడియోలు సినీ ఇండస్ట్రీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇవి దేదీప్యమానంగా వెలుగుతున్న సమయంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన సినిమా షూటింగ్స్ చెన్నైలోని ఈ మూడు స్టూడియోల్లోనే జరిగేవి.
ఇప్పుడు అలాంటి చరిత్ర ఉన్న ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజాగారు థియేటర్ నాదంటూ, స్థలం నాదంటూ కాంట్రవర్సీ చేయడం, కోర్టు కెళ్లడం బాధాకరం. ఇలా చేయడం ఇవాళ ఆయన ఉన్న స్థాయికి తగదని నేను భావిస్తున్నాను. ఆరోజుల్లో ఇళయరాజాగారు, దేవాగారు, చక్రవర్తిగారు బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్‌గా ఉన్నారు. ఆరోజుల్లో వాళ్లకి రికార్డింగ్ థియేటర్స్ కావాలంటే ఇబ్బందులు వస్తాయేమోనని ఎల్.వి.ప్రసాద్‌గారు ఇళయరాజాగారి కోసం ప్రసాద్ డీలక్స్ థియేటర్‌ను డెవలప్ చేసి కావాల్సిన ఎక్విప్మెంట్స్ సిద్ధం చేసి ఆయన రికార్డింగులకు అనుకూలంగా చేసి ఇచ్చారు. అప్పట్లో చక్రవర్తిగారికి ఎవీయం స్టూడియోలో ప్రత్యేకమైన రీరికార్డింగ్ రూమ్ ఉండేది. ఇలా వీరు బిజీగా సినిమాలు చేశారు.
ఇళయరాజాగారు ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ స్థలం నాదంటూ కోర్టు కెక్కడం తగదు. ఇటు ఇళయరాజాగారికి కానీ.. అప్పట్లో ఇళయరాజా చేసే రికార్డింగులకు ఆయన పనిచేసే నిర్మాతలే ప్రసాద్ ల్యాబ్స్‌కు డబ్బులు కట్టేవారు. అటు ప్రసాద్ ల్యాబ్స్ యాజమాన్యానికి కానీ.. ఎలాంటి డీలింగ్స్ లేవు. ఆయన తన థియేటర్‌ను కూలగొట్టారని పేపేర్లకు ఎక్కారు. ఈ సమస్య ప్రారంభం రోజునే ఇన్వాయిస్ చూపించి తన వాయిద్య పరికరాలను ఇళయరాజా తీసుకెళ్లిపోయారు. ఎల్.వి.ప్రసాద్‌గారి ఫ్యామిలీ తరతరాలుగా సినీ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఇప్పుడున్న ప్రసాద్ థియేటర్స్ స్థానంలో కొత్త థియేటర్‌ను కట్టాలనే వారు ఆలోచిస్తున్నారు. ఇళయరాజాగారు పెద్ద లెజెండ్ అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయడం తగదు. ఆయన ఎందుకు ఈ పని చేశారు? ఎవరి మాట విని చేశారు? అని తెలియడం లేదు. ఇలాంటి పనులను ఇండస్ట్రీ ఎప్పుడూ హర్షించదు. ఇప్పటికైనా ఆయన కోర్టు కేసులను వాపస్ తీసుకుంటే బావుంటుంది’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout