లీగల్ నోటీసులిచ్చి.. తాటతీస్తాం : జనసేన వార్నింగ్

  • IndiaGlitz, [Wednesday,February 26 2020]

సామాజిక మాద్యమాల్లో జనసేన పార్టీని, పార్టీ విధానాలను తప్పుబడుతూ పోస్టులు బెడుతున్న వారి భరతం పట్టాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘గతంలో పార్టీలో ఉండి.. ఆపై ఇతర పార్టీలకు అమ్ముడుపోయి ఇప్పటికీ పార్టీలో ఉన్నామని చెప్పుకొంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పార్టీని, పార్టీ విధానాలను, ముఖ్య నాయకులను, కార్యనిర్వాహకులను కించపరుస్తూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న విషయం పార్టీ దృష్టికి చేరింది. పార్టీ సిద్ధాంతాలపై గౌరవంగానీ, అధ్యక్షుల వారిపై అభిమానంగానీ లేనివారే ఈ తరహా వ్యాఖ్యలకు దిగుతున్నారు. దురుద్దేశపూర్వకంగానే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించకూడదని పార్టీ లీగల్ సెల్ నిర్ణయించింది’ అని జనసేన అధికారికంగా విడుదల చేసిన ఓ ప్రకటన పేర్కొంది.

క్రిమినల్ కేసులే!

‘రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో లైవ్ వీడియోలు పెడుతూ ఫేస్ బుక్, వాట్సప్‌ల్లో పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్న విషయం లీగల్ సెల్ గుర్తించింది. ఈ విధమైన తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన ప్రక్రియను చేపడతాం. ముందుగా లీగల్ నోటీసులు జారీచేసి, తదుపరి క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించాం’ అని జనసేన పార్టీ న్యాయ విభాగం కో ఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ తెలిపారు. మొత్తానికి చూస్తే పార్టీని కించపరుస్తూ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్న ఇంటి దొంగలను పట్టుకొని తాట తీయడానికి జనసేన రంగం సిద్ధం చేసిందన్న మాట.