వెయ్యి కోట్ల సినిమాకు అప్పుడే కష్టాలు...

  • IndiaGlitz, [Wednesday,May 24 2017]

ఇండియన్ సినిమా బ‌డ్జెట్ ఐదు వంద‌ల కోట్లు కూడా క్రాస్ చేయ‌ని త‌రుణంలో 'మ‌హాభార‌తం' సినిమాను వెయ్యి కోట్ల‌తో నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించ‌గానే అంద‌రూ షాక‌య్యారు. నాలుగేళ్ళ ప్రాజెక్ట్‌. ఇటు బాలీవుడ్‌, అటు ద‌క్షిణాది హీరోలు అంద‌రూ ఈ సినిమాలో న‌టించ‌నున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, జాతీయ అవార్డ్ గ్ర‌హీత ఎం.టి.రాందేవ్ నాయ‌ర్ ర‌చించిన 'రాంద‌మూళం' ఆధారంగా మ‌హాభార‌తం సినిమా తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. భీముడిగా మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించ‌బోతున్నాడు. క‌ర్ణుడిగా న‌టించ‌మ‌ని యూనిట్ వారు సంప్ర‌దించారు.

ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే, ఇంకా సెట్స్‌లోకి వెళ్ళ‌ని ఈ సినిమాకు మ‌హాభార‌తం అని పేరు పెడితే ఒప్పుకోబోమ‌ని కేర‌ళ‌కు చెందిన హిందూ ఐక్య వేదిక హెచ్చ‌రింది. ఆ సంఘం అధ్య‌క్షురాలు శ‌శిక‌ళ, రాంద‌మూలం న‌వ‌ల ఆధారంగా సినిమా రూపొందనున్న‌ప్పుడు ఆ టైటిల్‌నే పెట్టుకోవాలే త‌ప్ప మ‌హాభారతం అనే టైటిల్‌ను ఎందుకు పెడ‌తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌వేళ హెచ్చిరిక‌ను ప‌ట్టించుకోకుండా మ‌హాభార‌తం అనే టైటిల్ పెడితే సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల కానివ్వమ‌న్నారు. వెయ్యి కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాను యు.ఎ.ఇకి చెందిన బి.ఆర్‌.శెట్టి నిర్మాత‌గా వి.ఎ.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది