మోదీపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Sunday,April 21 2019]
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ నేతల నోటి నుంచి ఎప్పుడేం పలుకులు వస్తాయో.. ఎవరేం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో వారికే తెలియని పరిస్థితి. తాజాగా.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ.. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని వయనాడ్ జిల్లాలోని పూలపల్లిలో ప్రియాంక శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోదీది బలహీన ప్రభుత్వమని ఇలాంటి ప్రధానిని ఇదివరకెన్నడూ తాను చూడలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను ప్రియాంక కోరారు.
పాక్ గురించి తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదు!?
ప్రజలను గౌరవిస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రధాని ఇప్పుడు మీకు అవసరమని.. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. కానీ బీజేపీ సర్కార్ మాత్రం ప్రజల్ని విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశం నలుమాలల నుంచి తమగోడు చెప్పుకునేందుకు దేశ రాజధానికి రైతులు వస్తే వారిని తరిమికొట్టిన ఉదంతాన్ని ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎంతసేపూ పాకిస్థాన్ గురించి మాట్లాడతారే తప్ప.. ప్రజలకు ఫలానా చేసేశామని.. ఏం చేయబోతున్నామన్నది మాత్రం మోదీ చెప్పరని మోదీ.. బీజేపీ నేతలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రజలను ఇంతవరకూ ఎప్పుడూలేని ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని ప్రియాంక ఆరోపించారు. ఈ ఆరోపణలపై బీజేపీ నేతలు.. ముఖ్యంగా మోదీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.