రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యమివ్వండి: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
అంతర్వేది లక్ష్మీనారసింహుని రథం దగ్ధం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో నూతన రథం నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే రథ నిర్మాణ బాధ్యతలు అగ్నికుల క్షత్రియులకు అప్పగించాలని.. లేదంటే నిర్మాణంలో వారికి ప్రాధాన్యమివ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆలయానికి నూతన రథం నిర్మాణంలో ప్రభుత్వం ఆలయ సంప్రదాయాలు, స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని పవన్ కోరారు.
అంతర్వేదిలో లక్ష్మీ నారసింహుడిని అగ్ని కులక్షత్రీయులు తమ కుల దైవంగా పూజిస్తుంటారని పవన్ పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రీయుడైన కొపనాతి కృష్ణమ్మ నిర్మించిన సంగతి యావన్మందికి విదితమేనన్నారు. స్వామివారి తొలి రథాన్ని కూడా కృష్ణమ్మ రూపొందించారని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. శిథిలావస్థకు చేరిన ఆ రథం స్థానంలో ఇటీవల అగ్నికి ఆహుతి అయిన రథం కూడా స్థానిక అగ్నికుల క్షత్రీయులు తయారుచేసినదేనని వెల్లడించారు.
ఇప్పుడు నూతన రథం నిర్మాణంలో తమకు ప్రాధాన్యత లేకపోవడంపై అగ్నికుల క్షత్రీయ సంఘం వారు ఆవేదన చెందుతున్నారని పవన్ పేర్కొన్నారు. రథం రూపకల్పన కమిటీలో అగ్నికుల క్షత్రీయలకు ప్రాతినిథ్యం లేకపోవడం శోచనీయమన్నారు. రథోత్సవం నాడు తొలి కొబ్బరికాయ కొట్టి రథాన్ని లాగేది అగ్నికుల క్షత్రీయులేనని వెల్లడించారు. కాబట్టి వారి మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అగ్నికుల క్షత్రియులను గౌరవిస్తూ రథం తయారీలో వారిని భాగస్వామ్యులను చెయ్యాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments