PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Wednesday,February 28 2024]

పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టా్త్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా 370 ఎంపీ సీట్లు గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగ్గట్లే కార్యాచరణను ప్రారంభించింది. అలాగే తెలంగాణలోనూ ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలు పర్యటనలు చేస్తుండగా.. తాజాగా అగ్ర నేతలు రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.

ఈ మేరకు ఆయన టూర్ షెడ్యూల్ ఖారారైంది. మార్చి 4, 5 తేదీల్లో అదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఎన్నికల ప్రచార సభల్లోనూ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నట్లు తెలుస్తోంది. మోదీ పర్యటన ఖరారు కావడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. మోదీ పర్యటన అనంతరం ఆయన రాష్ట్రానికి రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మార్చి4వ తేదీ ఉదయం 9:20 నిమిషాలకు ప్రత్యేక విమానంలో నాగపూర్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా ఆదిలాబాద్ చేరుకుంటారు. ఉదయం పదిన్నర నుంచి 11 గంటల వరకు ఆదిలాబాద్‌లో కొన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తారు. 11.15 గంటల నుంచి 12 గంటల వరకు ఆదిలాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం తమిళనాడు పర్యటనకు వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకొని రాత్రికి రాజ్ భవన్‌లో బస చేస్తారు.

మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్ భవన్ నుంచి బయలుదేరి సంగారెడ్డి చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం 11.30 గంటల నుంచి 12.15 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పర్యటన ముగియడంతో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బడిశాకు వెళ్లనున్నారు.