PM Modi: లేపాక్షి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు.. మూలవిరాట్‌కు స్వయంగా హారతి..

  • IndiaGlitz, [Tuesday,January 16 2024]

ప్రధాని మోదీ దక్షిణాది పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా ముందుగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధాని వెంట గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. లేపాక్షి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు, జిల్లా అధికారులు, పురావస్తు శాఖ సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం లేపాక్షి ఆలయానికి వెళ్లి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి స్వయంగా హారతి ఇచ్చారు.

ప్రత్యేక పూజల్లో భాగంగా జై శ్రీరామ్ అంటూ భజన పాటలు పాడారు. ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధాని వివరించారు. దర్శనానంతరం మోదీకి ఆలయ అర్చకులు వేదాశ్వీరచనాలుతో ఆశీర్వదించి స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. సుమారుగా 40 నిమిషాల పాటు మోదీ ఆలయ ప్రాంగణంలోనే గడిపారు. మోదీ రాకతో ఆలయ ప్రాంగణంలో సీతారాముల విశేషాలను తెలిపేలా తోలుబొమ్మలాటల రూపంలో రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారు.

లేపాక్షి సందర్శన అనంతరం గోరంట్ల మండలం పాలసముద్రంలో నెలకొల్పిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్(NACIN)లో నిర్మించిన క్యాంపస్ భవనాలను మోదీ ప్రారంభించారు. ఐఆర్ఎస్‌కు ఎంపికైన ట్రైనీ అభ్యర్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. అలాగే భూటాన్‌కు చెందిన రాయల్ సివిల్ సర్వీసెస్ విభాగ ఆఫీసర్ ట్రైనీస్‌తో ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. ఇక రేపు కేరళలో పర్యటించనున్నారు.