Prime Minister Modi:ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. ఎన్ని రోజులంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారం వాడివేడి జరుగుతోంది. అన్ని పార్టీలు మెజార్టీ స్థానాలే గెలవాలనే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. ఇక బీజేపీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి పాగా వేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ ఈసారి ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిలోనూ ఆచితూచి వ్యవహరించింది. గెలుపు గుర్రాలను అభ్యర్థులుగా నిలిపేందుకు ఇతర పార్టీల్లోని బలమైన నేతలను కూడా చేర్చుకుని టికెట్లు కేటాయించింది. దీంతో ఇప్పటికే రాష్ట్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలవగా.. ఈసారి కనీసం 8 లేదా 10 స్థానాలు ఈసారి గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్లే అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలిచి బలం పెంచుకుంది. మరో 14 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఇదే ఊపును కొనసాగిస్తూ వీలైనన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర నేతలు ప్రచారంలో బిజీ కాగా ఇక నుంచి జాతీయ నేతలు రంగంలోకి దిగనున్నారు. గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో పార్టీ అగ్రనేతలు ప్రచారపర్వంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 30వ తేదీతో పాటు మే 3,4వ తేదీల్లో ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీన అందోల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం శేరిలింగలంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశం అవుతారు. తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మే 3వ తేదీన వరంగల్ పార్లమెంట్ పరిధితో పాటు భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటుచేసే సభల్లో పాల్గొంటారు.
ఇక 4వ తేదీన మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రోడ్‌షోలు కూడా ఉండనున్నాయి. మరోవైపు ఏప్రిల్ 25న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు మరోసారి ప్రధాని రాష్ట్రానికి వచ్చి పర్యటన చేయనున్నట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com