కోవిడ్ టీకాను తీసుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి రెండవ దశలో టీకా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన దేశప్రజలంతా కొవిడ్‌ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు కోవిడ్‌కి వ్యతిరేకంగా చేస్తున్న కృషిని అభినందించారు. అలాగే మనమందరం కలిసికట్టుగా భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను తీసుకున్నారు. ఎయిమ్స్‌లో పనిచేస్తున్న సిస్టర్‌ నివేదా ప్రధానికి టీకా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీకా వేసే సమయంలో సిస్టర్ నివేదాతో పాటు కేరళకు చెందిన మరో నర్సు కూడా అక్కడే ఉన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయాన్నే ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన కోవిడ్ టీకాను తీసుకున్నారు. అయితే టీకా తీసుకున్న సమయంలో మోదీ అసోంలో తయారు చేసిన గమ్చాను ధరించి కనిపించారు. అసోం మహిళల ఆశీస్సులకు చిహ్నంగా ఆయన ఈ వస్త్రాన్ని ధరించారు. పలు కీలక సందర్భాల్లో మోదీ ఈ గమ్చాను ధరించి కనిపిస్తూ వచ్చారు.