Prime Minister Modi :కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు.. ఏమన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం చేయూత అందిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని రూ.9వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సభావేదిక పైకి మోదీని బీజేపీ నేతలు పూల రథంలో ఆహ్వానించారు. మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి వాహనంలో వేదికపైకి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు అడుగుడుగునా మోదీపై పూల వర్షం కురిపించారు. అనంతరం తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. మోదీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ అని.. మోదీ ఏది చెబితే అది చేసి చూపిస్తాడని తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్ 370 రద్దు హామీ అమలు చేశామని.. అయోధ్య రామ మందిరం నిర్మించి తీరామని.. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన జరిగిందన్నారు. అలాగే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దడమే మరో గ్యారంటీ అన్నారు. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధిగా తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్ బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేశామని దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రం ఇది అన్నారు. దీని ద్వారా హైదరాబాద్‌తో పాటు తెలంగాణకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. ఏవియేషన్ కేంద్రం, స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణకు వేదికగా హైదరాబాద్ నిలుస్తుందని కొనియాడారు.
ఘట్ కేసర్- లింగంపల్లి మధ్య ప్రారంభించిన ఎంఎంటీఎస్ రైళ్లతో కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. సంగారెడ్డి వేదికగా రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని.. దీని వల్ల తెలంగాణలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరుగుతుందని ఆయన వెల్లడించారు. పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపుగా మారాయని.. ప్రస్తుతం భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందన్నారు. భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలక భూమిక పోషిస్తున్నారని మోదీ ప్రశంసించారు.
ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుతో వేల కోట్లు దోచుకుందని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా దానిని ఏటీఎం లాగా మార్చుకుంటుందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలు అని విమర్శించారు. అలాగే తనకు కుటుంబం లేదంటూ ఇండియా కూటమి నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మోదీ విమర్శలు గుప్పించారు. 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులంతా తన పరివారమే(కుటుంబమే)అని గట్టిగా చెప్పారు. అంతేకాకుండా ‘మేమే మోదీ కుటుంబం’అంటూ తెలుగులో సభకు హాజరైన జనంతో చెప్పించారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీలు పాలించడంతో వాళ్లే బాగుపడ్డారని విమర్శలు గుప్పించారు. కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా? అని మోడీ ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలను తాము వ్యతిరేకిస్తున్నామని కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ తమపై విమర్శలు చేస్తుందన్నారు. కుటుంబ రాజకీయాలతో యువతకు అవకాశాలు దొరకడంలేదని మండిపడ్డారు.
కాగా అంతకుముందు మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయాన్ని మోదీ సందర్శించారు. ఆలయ పూజారులు, అధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేయించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి వస్త్రం, ఫొటో ఫ్రేమ్, తీర్థప్రసాదాలను అందజేశారు. తెలంగాణలో రెండు రోజుల పర్యటన ముగియడంతో మోదీ ఢిల్లీకి పయనమయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com