Prime Minister Modi:హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా హాజరైన కార్యకర్తలు..
- IndiaGlitz, [Monday,November 27 2023]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ప్రధాని మోదీ నిర్వహించిన భారీ రోడ్ షో ముగిసింది. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ క్రాస్‌రోడ్స్ వరకు 3కిలోమీటర్ల మేర సాగింది. దారి పొడవున బీజేపీ-జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై మోదీకి పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. మోదీ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో 25 వేదికలను ఏర్పాటుచేశారు. ఒక్కో వేదికపై ఒక్కో నియోజకవర్గ అభ్యర్థి నిలబడి.. మోదీకి తమ మద్దతు తెలపడం విశేషం.
గతంలో మోదీ ఇలాగే రెండుసార్లు రోడ్ షోలు నిర్వహించారు. ఒకటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. మరొకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాన్ని అందుకోగా.. కర్ణాటకలో మాత్రం ఓడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరి పోరు జరగనున్న నేపథ్యంలో మోదీ రోడ్‌షో ఏమాత్రం కమలం పార్టీకి ఏమాత్రం ప్రయోజనం చేకూరుస్తుందో వేచి చూడాలి.
అంతకుముందు కరీంనగర్లో నిర్వహించిన బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రజలు గతంలోనే సీఎం కేసీఆర్‌కు ట్రైలర్ చూపించారని.. ఈ ఎన్నికల్లో ఆయనకు పూర్తి సినిమా చూపిస్తారని తెలిపారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తే సీఎం అవుతారని మరోసారి స్పష్టంచేశారు. ఈ ఐదేళ్లలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ కావాలని.. అలా జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు.